గోపాల్పేట, జూన్ 29 : బుద్ధారం పెద్దచెరువు రిజర్వాయర్ కోసం భూములు కోల్పోయే ముంపు రైతులకు పరిహారం పెంచి ఇవ్వాలని మండలంలోని బుద్ధారం గ్రామంలో బాధిత రైతులు, బీఆర్ఎస్ సర్పంచ్ డాక్టర్ పలుస శేఖర్‌గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం పెద్దఎత్తున రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో, ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుద్ధారం పెద్ద చెరువు రిజర్వాయర్ కోసం ప్రభుత్వం ఇంతకు ముందు సేకరించిన 101 ఎకరాల (సాగుకు యో గ్యం కాని) భూమి ఎకరాకు రూ. 12.40లక్షల చొప్పున పరిహారం అందజేశారని, రిజర్వాయర్ ఎత్తు పెంచడం వల్ల మరో 110 ఎకరాల (సాగుకు యోగ్యమైన) భూమి ముంపునకు గురికానుందని, సాగుకు యోగ్యమైన భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ 40లక్షల చొప్పున పరిహారం అందించాలని, లేదా ఎకరాకు రెండెకరాల చొప్పున ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమిని కేటాయించాలని బాధిత రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిజర్వాయర్ కోసం కోల్పోయే రైతులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు . రిజర్వాయర్ కోసం భూములు కోల్పోయే నిరుపేద రైతులకు సబ్సిడీపై బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేసి, స్వయం ఉపాధి కల్పించి ఆదుకోవాలన్నారు.
అదే విధంగా గతంలో సొంత స్థలంతో 40 మంది డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించుకున్నారని వారికి ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయాలని కోరారు. ఇది ఇలా ఉండగా రైతుల ధర్నా వద్దకు చేరుకున్న ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చి న్నారెడ్డి మాట్లాడుతూ..బుద్ధారం పెద్ద చెరువు రిజర్వాయర్ కోసం భూములు కోల్పోతున్న రైతులకు న్యా యమైన పరిహారం అందేలా ప్రభుత్వంతో మాట్లాడనున్నట్లు తెలిపారు. సొంత స్థలాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించుకున్న 40మంది కి ఇండ్ల బిల్లులు మంజూరు అయ్యేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.