గద్వాల : అతను ప్రభుత్వ ఉద్యోగి. రెండు పశువైద్యశాలలకు (Veterinary Hospital ) ఇన్చార్జి. ప్రతి రోజు రెండు చోట్ల కాకపోయినా ఒకచోటనైనా విధులు నిర్వర్తించాలి కదా. ప్రభుత్వ విధులను కాదని అతనికి ఉన్న ప్రైవేట్ క్లినిక్ ( Private Clinic ) పైనే మక్కువ ఎక్కువ. పైసాయే అతడికి ప్రాదాన్యత . ఎవరు ఏమైతే నాకేంటి అన్న చందాన ఆయన తీరుపై పశు యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ జీవాలకు సరైన వైద్యం అందక మృత్యువాత పడుతున్నాయని రైతులు వాపోతున్నారు.
జోగులాంబ జిల్లా( Jogulamba District) అయిజ పశువైద్యశాలలో పనిచేసే డాక్టరు (Veterinary Doctor ) అదే జిల్లాలోని మాన్‌దొడ్డి పశువైద్యశాలకు కూడా ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. మాన్‌దొడ్డి రైతులు ఫోన్ చేస్తే అయిజలో ఉన్నానని, అయిజ నుంచి ఫోన్ చేస్తే మాన్‌దొడ్డిలో ఉన్నానని చెబుతు విధులకు డుమ్మా కొట్టి అచ్చంపేటలోని తన సొంత క్లీనిక్‌లో పనిచేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
డ్యూటీకి ఎప్పుడో ఒకసారి వెళ్లి రిజిష్టర్‌లో సంతకాలు పెడుతున్నారని విమర్శిస్తున్నారు. నివసించేది అచ్చంపేట. విధులేమో ఐజ, మాన్‌దొడ్డి. ప్రతి రోజూ విధులకు హాజరు కావడం కంటే సొంత క్లీనిక్పైనే దృష్టిని సారించిడంపై పశు పోషకులు మండిపడుతున్నారు. వైద్యుడు అందుబాటులో ఉండకపోవడం వల్ల సకాలంలో పశువులకు వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోయారు.