శ్రీశైలం, సెప్టెంబర్ 5 : శ్రీశైల మహాక్షేత్రాన్ని అనుసంధానిస్తూ ప్రవహించే కృష్ణానదిలో గణనాథులను నిమజ్జనం చేసేందుకు తెలంగాణ నలుమూల నుంచి శ్రీశైలంవైపునకు అధిక సంఖ్యలో యాత్రికులు చేరుకుంటున్నారు. శుక్రవారం నాటికి నవరాత్రులు ముగియడంతో వివిధ ప్రాంతాల నుంచి లారీలు, డీసీఎం, మినీవ్యాన్లు, ట్రాక్టర్లలో భారీ గణపయ్యలను తీసుకుని భజనలు చేస్తూ నల్లమల అటవీ ప్రాంతాన్ని దాటుకుని పా తాళగంగ వద్దకు చేరుకునేందుకు ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది.
ప్రధానంగా పాతాళగంగ లింగాలగట్టు బ్రిడ్జివద్ద భారీ వాహనాలు నిలిచిపోయి గణనాథులను నిమజ్జనం చేసేందుకు సరైన ఏర్పాట్లు లేకపోవడం వల్ల యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. సుమారు 10కిలో మీటర్లమేర స్తం భించిన ట్రాఫిక్‌లో దోమలపెంట నుంచి శ్రీశైలం చేరుకునేందుకు ఆరు గంటల సమయం పట్టిందని పులువురు యాత్రికులు అసహనం వ్యక్తం చేశారు. ప్రతి యే టా జరిగే నిమజ్జనోత్సవాలను దృష్టిలో ఉంచుకొని సరిహద్దుల వద్దగల సంబంధిత శాఖల అధికారులు కనీస ఏర్పాట్లు కూడా చేయకపోవడం శోచనీయమని అభిప్రాయపడుతున్నారు.
నిండుకుండను తలపిస్తూ పరవళ్లు తొక్కుతున్న నదిపై వంతెన నుంచి ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిమజ్జనాలు చేస్తుండడం అత్యంత ప్రమాదకరంగా ఉంది. సుమారు 10 నుంచి 20 అడుగులకు వరకు ఎత్తుగల గణపయ్యలను బ్రిడ్జిపై నుంచి గంగలో దించేందుకు క్రేన్ సదుపాయంలేకపోవడం ప్రమాదకరమైనదిగా యాత్రికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా పలు శాఖల అధికారులు చొరవ తీసుకొని తాత్కాలిక ఏర్పాట్లను కల్పించి నిమజ్జన కార్యక్రమాన్ని శాంతియుతంగా జరిపేలా చర్యలు తీసుకోవాలని యాత్రికులు కోరుతున్నారు.