రాజోళి మండలం పెద్ద ధన్వాడ శివారులో ఇథనాల్ ఫ్యాక్టరీ మంట రేపింది. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్ద ధన్వాడ శివారులో ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పనులు మొదలు పెట్టగా.. రైతులు, స్థానికులు అడ్డుకుంటూ వచ్చారు. పచ్చని పొలాల మధ్య విషపూరితమైన ఫ్యాక్టరీ ఏర్పాటు చేయొద్దని ఆందోళన చేపట్టారు. 8 నెలలుగా పనులను అడ్డుకుంటూ వచ్చారు. కొన్ని నెలల రాజోళి మండల రైతులతో కిందట జిల్లా అధికారులు సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించేందుకు యత్నించారు. కానీ స్థానికులు ముక్తకంఠంతో ఫ్యాక్టరీ వద్దని తేల్చిచెప్పారు. తర్వాత అంపూర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుల హామీతో ప్రజలు నిరసన విరమించారు. అయితే సోమవారం అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా కంపెనీ యాజమాన్యం వాహనాలను, కంటైనర్లను, ప్రైవేటు సిబ్బందిని, గూండాలను దించింది.
ఈ విషయం చుట్టుపక్కల గ్రామాల రైతులు, ప్రజలకు తెలియడంతో కంపెనీ ఏర్పాటు చేసే ప్రాంతం వద్దకు బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో దాదాపు ఐదు గ్రామాలకు చెందిన దాదాపు 3 వేల మంది రైతులు, ప్రజలు, యువకులు వెళ్లారు. అప్పటికే అక్కడ మోహరించిన దాదాపు 200 మంది పోలీసులు వీరిని వెళ్లకుండా అడ్డుకున్నారు. కంపెనీ ఏర్పాటు చేయొద్దని సూచించినా ఎందుకు పనులు చేసేందుకు వచ్చారని స్థానికులు నిలదీశారు. తాము శాంతియుతంగా ఆందోళనలు చేస్తుంటే పనులు ప్రారంభించాలని చూడడం సరికాదన్నారు. దీంతో అక్కడున్న సిబ్బంది, గూండాలు స్థానిక రైతుల పట్ల దురుసుగా మాట్లాడారు. వారిని బెదిరింపులకు గురిచేశారు.
ఈ సమయంలో అక్కడే ఉన్న పెద్ద ధన్వాడకు చెందిన మహిళ మరియమ్మపై కొందరు గూండాలు దాడికి దిగగా గాయపడింది. దీంతో అక్కడున్న వారి ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. పోలీసులను తోసుకొని కంపెనీ ఏర్పాటు చేసే ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన కంటైనర్ హౌస్, కంపెనీకి చెందిన వాహనాలను ఎత్తేసి నిప్పు పెట్టారు. అక్కడే ఉన్న రెండు జేసీబీల అద్దాలు పగులగొట్టారు. టెంట్లు, వస్తువులు ధ్వంసం చేశారు. కంపెనీ సిబ్బంది, గూండాలపై దాడికి దిగారు.
పోలీసులు చేష్టలుడిగి చూస్తుండిపోయారు. దాదాపు 10:35 గంటల నుంచి 11:30 గంటల వరకు తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. తమ సహనాన్ని పరీక్షిస్తే సహించేది లేదంటూ మహిళలు కట్టెలతో దాడికి పాల్పడ్డారు. తాము నిరసనలు చేపట్టినా కనికరం లేకుండా పనులు చేయాలని చూస్తారా? అంటూ కోపంతో ఊగిపోయారు. కాంగ్రెస్ నేత సంపత్‌కుమార్ రైతులకిచ్చిన హామీ మేరకు ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేయాలని వారంతా డిమాండ్ చేశారు. కొద్దిసేపటి తర్వాత అక్కడి నుంచి అందరూ వెళ్లిపోయారు. ప్రస్తుతం పోలీసులు మాత్రం పహారాలో ఉన్నారు.