మక్తల్, జూన్ 14 : అవినీతికి పాల్పడిన ఎస్సైని మండల కేంద్రానికి మళ్లీ ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించినందుకు.. మక్తల్ ఎమ్మెల్యే, అతడి అనుచరుడు, కాంగ్రెస్ పార్టీ నర్వ మండల అధ్యక్షుడు చెన్నయ్యసాగర్ చేసిన అరాచకాలకు తట్టుకోలేక బీజేపీ కార్యకర్త చంద్రశేఖర్‌రెడ్డి(39) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మక్తల్ నియోజకవర్గం నర్వలో చోటుచేసుకున్నది. వివరాలిలా.. గురువారం ఎమ్మెల్యే శ్రీహరి నర్వలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లారు. ఆ సమయంలో పక పొలంలోనే ఉన్న నర్వకు చెందిన బీజేపీ కార్యకర్త మున్నూరు శేఖర్‌రెడ్డి ఇదే మండలంలో పనిచేసి వెళ్లిన ఎస్సై విక్రమ్‌ను మళ్లీ ఇక్కడికే తీసుకొచ్చేందుకు చూస్తున్నారని.. అవినీతి అధికారిని మళ్లీ ఎందుకు తీసుకొస్తారని ఎమ్మెల్యేని ప్రశ్నించాడు. దీంతో ఎమ్మెల్యే, అతడి ప్రధాన అనుచరుడైన నర్వ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చెన్నయ్యసాగర్ ఆగ్రహంతో ఊగిపోయారు. మా ప్రభుత్వం మా ఇష్టం.. అడగడానికి నువ్వెవరని శేఖర్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. అకడితో ఆగకుండా శేఖర్‌రెడ్డిపై చెన్నయ్యసాగర్ ఫిర్యాదు చేశాడు. ఎస్సై కుర్మయ్యతో శేఖర్‌రెడ్డిని బెదిరించి స్టేషన్‌కు వచ్చాక లాకప్ డెత్ చేస్తామని బెదిరించాడు. దీంతో భయభ్రాంతులకు గురైన శేఖర్‌రెడ్డి గురువారం రాత్రి పురుగుల మం దు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లగా కుటుంబసభ్యులు గమనించి పాలమూరు ప్రభుత్వ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కార్యకర్త అయిన శేఖర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తే.. ఎమ్మెల్యేగా గెలిచిన ఐదు నెలల్లోనే ఎమ్మెల్యే నియోజకవర్గంలో అరాచకాలు సృష్టిస్తున్నారని మండల బీజేపీ కార్యకర్తలు వాపోతున్నారు. అవినీతి అధికారిని ఎలా తీసుకొస్తారని ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే, అతని అనుచరుడితోపాటు ఎస్సై బెదిరింపులకు పాల్పడడంతో శేఖర్‌రెడ్డి ప్రాణాలను పోగొట్టుకున్నాడన్నారు. శేఖర్‌రెడ్డి మృతికి కారకులైన ఎమ్మెల్యే, చెన్నయ్యసాగర్, ఎస్సై కుర్మయ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామని బీజేపీ మండల నాయకులు హెచ్చరించారు.
‘కాలేజీ కోసం స్థల పరిశీలన చేసే సమయంలో జరిగిన మాటల్లో ఎమ్మెల్యే శ్రీహరి, చెన్నయ్యసాగర్ మాకు శేఖర్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి శేఖర్‌రెడ్డిని పోలీస్ స్టేషన్‌కు రావాలని ఫోన్ చేశాం. అయితే పోలీస్ స్టేషన్‌కు వస్తే ఏమైతుందో అని భయపడిన శేఖర్‌రెడ్డి పోలీస్ స్టేషన్‌కు రాకుండా పురుగుల మందు తాగాడు. జిల్లా దవాఖానకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.’