వనపర్తి, మార్చి 3(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను నిలిపివేసి చోద్యం చూస్తున్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి దుయ్యబట్టారు. వనపర్తికి సీఎం పర్యటనతో కొత్తగా ఒరిగిందేమీ లేదని సింగిరెడ్డి కొట్టిపారేశారు. ఇటీవల వనపర్తి సభలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రసంగంపై మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి సోమవారం స్పందించారు.
వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తవుతుందని, ఇందుకు నిధులు ఇవ్వడానికి సీఎంకు చేతులు రావడం లేదన్నారు. పేరుకే జిల్లాకు చెందిన బిడ్డను అని చెప్పుకోవడమే తప్పా ఉమ్మడి జిల్లా రైతులకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. జిల్లాపై చిత్తశుద్ధి ఉంటే.. ఇప్పటికే ఈ ప్రాజెక్టును పూర్తి చేసే పరిస్థితులుండేవని, మొత్తం పనులను నిలిపి మరింత రైతాంగానికి తీరని నష్టం చేశారన్నారు. తక్షణమే ఈ ప్రాజెక్టును పూర్తి చేసి రేవంత్‌రెడ్డి నిబద్ధతను చాటుకోవాలని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
వనపర్తిలో సీఎం పర్యటన ద్వారా ఈ ప్రాంతానికి కొత్తగా ఒరిగిందేమీ లేదన్నారు. గత సీఎం కేసీఆర్ వనపర్తికి మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, ప్రభుత్వ దవాఖానలను మంజూరు చేయగా, ఇంతకు ముందే శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. అవి ప్రస్తుతం నిర్మాణ దశల్లో ఉన్నాయని, వాటికి తిరిగి శంకుస్థాపన చేయించడం విడ్డూరమన్నారు. రూ.550 కోట్లను నాటి సీఎం కేసీఆర్ మెడికల్ కళాశాలకు మంజూరు చేశారని, అలాగే రూ.21 కోట్లతో ఐటీ టవర్‌కు అప్పటి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తే.. ఆ శిలాపలకం పగులగొట్టి తిరిగి రేవంత్‌రెడ్డితో శంకుస్థాపన చేయడం ఎంతవరకు సమంజసమని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు.
కొత్తగా రహదారులు, ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటును స్వాగతిస్తున్నామని, కొత్తగా ఏ అభివృద్ధిని సాధించినా ఆహ్వానిస్తామన్నారు. గత ప్రభుత్వంలో మంజూరైన బైపాస్ రోడ్డు, పెబ్బేరు రోడ్డు ప నులను నిలిపివేశారని, రూ.120 కోట్ల ఎస్డీఎఫ్ పనులను అర్ధాంతరంగా నిలిపి వేశారన్నారు. పాలిటెక్నిక్ కళాశాల ప్రాధాన్యతను గుర్తించి రూ.22 కోట్లతో పనులకు శంకుస్థాపన చేస్తే.. వాటిని సైతం రద్దు చేశారన్నారు.
అలాగే జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలను సాధించుకుని, భవనాల కోసం తొలి విడుతగా రూ.7కోట్లతో పనులు చేపట్టడం జరిగిందని, రెండో దశ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. ఇప్పటికీ అద్దె భవనంలో కొనసాగుతున్న బీసీ వ్యవసాయ, డిగ్రీ కళాశాలలు అద్దె భవనంలో కొనసాగుతున్నాయని, శాశ్విత భవనం కోసం ప్రయత్నించడం లేదన్నారు. వనపర్తిలో 3,200 డబల్ బెడ్రూంలు, కలెక్టరేట్, ఎస్పీ కార్యాయాలు, రోడ్ల విస్తరణ, ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలల అభివృద్ధి మీకు కనిపించడం లేదా అని సింగిరెడ్డి ప్రశ్నించారు.
రెబల్ కార్యకర్తలా రేవంత్
రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా కాకుండా రాజకీయ పార్టీలో రెబల్ కార్యకర్తలా రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నాడని, అబద్ధాలు చెప్పడం నిరంతరం ఆయనకు అలవాటైందన్నారు. ప్రభుత్వ,పార్టీ సభలకు తేడాతెలియని వారు మన పాలకులుగా ఉండడం మన దౌర్భాగ్యమన్నారు. కేసీఆర్‌ను తిట్టడానికే సభలు పెట్టినట్లుగా ఉందని, అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పిందేమిటీ… చేయాల్సిందేమిటో వదిలేసి.. వెళ్లినచోటల్లా అబద్ధాలు వల్లించడమే రేవంత్ తన దినచర్యగా పెట్టుకున్నాడని విమర్షించారు. గత ప్రభుత్వపైనా కేసీఆర్‌ను గుర్తు చేసుకోకుండా రేవంత్‌కు ఒక్కరోజు కూడా గడవడం లేదన్నారు.
ప్రభుత్వం వచ్చి 15 నెలలు గడిచినా కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయడం లేదని, పాలన మీద దృష్టి సారించడమే లేదని మాజీ మంత్రి ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో పాత్ర లేని వారు, తెలంగాణకు వ్యతిరేక పార్టీలను మోసిన నాయకులు నేడు కేసీఆర్‌ను చిన్నగా చూపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తెలంగాణ వచ్చింది కేసీఆర్ ద్వారానే అంటూ ఏపీ ప్రజలంతా చెబుతారు. ప్రతిదానికి కేసీఆర్‌ను నిందిస్తే సమయం వచ్చినప్పుడు వడ్డీతో సహా కక్కిస్తామని నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు.
2014కు ముందు ఉమ్మడి పాలమూరులో జూరాల ప్రాజెక్టుతోపాటు కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా కేవలం 12 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరందిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటు అనంతరమే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరిచ్చింది కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు. కాంగ్రెస్‌తో దేశానికి, రాష్ర్టానికి నష్టం జరిగిందని బీఆర్ఎస్లో చేరి మంత్రి అయిన జూపల్లి కృష్ణారావు తిరిగి కాంగ్రెస్ చేరి కేసీఆర్ హయాంలో అసలు ఏ పని జరగలేదని చెప్పడం హాస్యాస్పదమని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో 14 ఏండ్లు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడుగా, మంత్రిగా తొమ్మిదిన్నరేళ్లు పాలమూరు అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా పనిచేసిన సందర్భంలో తనను రాజకీయాలు కలుషితం చేశాయి అంటూ రేవంత్ మాట్లాడటం విడ్డూరమన్నారు. చిన్నారెడ్డి ఆదర్శం అంటున్న రేవంత్, ఆయనకు ఏఐసీసీ ఇచ్చిన అసెంబ్లీ టికెట్‌ను అమ్ముకున్నారని స్వయంగా చిన్నారెడ్డి ప్రకటించారు. దీనిపై ఏం సమాధానం చెబుతారన్నారు. ఒక్క నియోజక వర్గంతో జిల్లాను ఏర్పాటు చేస్తారా అంటూ నాడు ఎగతాళి చేసిన రేవంత్, నికార్సైన నాయకుడైతే ఇటీవలి పర్యటనలో తాను పశ్చాత్తాపం ప్రకటించాలన్నారు.
కేసీఆర్‌ను ఒప్పించి రామన్నగట్టుకు రూ.50 కోట్లతో రిజర్వాయర్‌ను సాధించుకున్నామని, దానికి మళ్లీ జీవో విడుదల చేసి, శంకుస్థాపన చేశారన్నారు. గతంలో వనపర్తి ఎమ్మెల్యేలుగా పని చేసిన వారికి తగిన ప్రాధాన్యతనివ్వడం జరుగుతూ వస్తున్నదని, వనపర్తి అభివృద్ధికి పునాదులు వేసింది మేమే…పనులు చేసింది మేమేనని నిరంజన్‌రెడ్డి ప్రకటించారు. మీరు కొత్తగా పేరు తెచ్చుకోవాలని ఉంటే పనులు చేసి ప్రజల మెప్పు పొందాలని నిరంజన్‌రెడ్డి హితవు పలికారు.