ఊట్కూర్ : ప్రజలు అంటువ్యాధుల ( Infectious diseases ) బారిన పడకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) జిల్లా నాయకురాలు, బిజ్వారం గ్రామ మాజీ సర్పంచ్ గవినోల్ల సావిత్రమ్మ, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు సిద్దు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌కు వినతి పత్రం (Representation ) అందజేశారు.
వారు మాట్లాడుతూ కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో సీజనల్ వ్యాధులు సోకి గ్రామాల్లో అనేక మంది ప్రజలు దవాఖానాల్లో చేరుతున్నారని ఆరోపిఆంచారు. డెంగీ, మలేరియా, టైఫాయిడ్, అతిసార వంటి అనేక భయానక వ్యాధులకు చిన్నపిల్లలు, వృద్ధులు గురై సరైన చికిత్సలు పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడం, సక్రమంగా డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగు నీరు చేరి దోమలు, ఈగలు వ్యాప్తి చెందుతున్నాయని ఆరోపించారు.
గ్రామాల్లో పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో విష సర్పాలు సంచరిస్తున్నాయని అధికారులు తక్షణమే పారిశుద్ధ్య చర్యలు చేపట్టి ముళ్ళ పొదలను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. రోగుల సౌకర్యార్థం ఊట్కూర్, పులిమామిడి పీహెచ్సీ సెంటర్లు, బిజ్వారం, చిన్నపొర్ల, పెద్దజట్రం, పగిడిమర్రి, మల్లేపల్లి సబ్ సెంటర్లలో తగినంత వైద్య సిబ్బందిని నియమించాలని, రోగులకు అన్ని వ్యాధులకు సంబంధించిన మందులు, వైద్య పరికరాలను అందుబాటులో ఉంచాలని కోరారు. కార్యక్రమంలో లింగప్ప, అంజమ్మ, చెన్నప్ప పాల్గొన్నారు.