మాగనూరు : వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సిఫారసు మేరకే యూరియా ( Urea ) ను వాడాలని వ్యవసాయ అధికారి సుదర్శన్ గౌడ్ ( AO Sudarsan Goud ) అన్నారు. గురువారం మాగనూర్ మండలం మంజపల్లి గ్రామంలో రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియా వాడకాన్ని సిఫారసు మేరకు వాడాలని, ప్రతి పంటలో ఎరువుల యాజమాన్యాన్ని పాటించి నేల ఆరోగ్యాన్ని కాపాడాలని సూచించారు. పచ్చి రొట్ట ఎరువులు, వేపపిండి ఎరువు, కోళ్ల ఎరువు, వావిసాకుల ఎరువు , జీవ శిలీంధ్రాలు, అంతర పంటలు, నేల శుద్ధిని పాటించాలని కోరారు.
వచ్చే వానాకాలం సాగుకు రైతులు తీసుకోవలసిన సలహాలు ,సూచనలను వివరించారు. డాక్టర్ బి. శైల, సస్యరక్షణ శాస్త్రవేత్త నీటి యాజమాన్యం, పురుగుల మందులు వాడేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఈవోరాధిక , గ్రామ సర్పంచ్ రఘువీర్ రెడ్డి, శ్రీనివాస్, ఉప సర్పంచ్ , రైతులు పాల్గొన్నారు.