గద్వాల, ఆగస్టు 23 : రైతన్నలకు యూరియా కష్టాలు తప్పడం లేదు. నిత్యం పీఏసీసీఎస్ చుట్టూ తిరుగుతు న్నా.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపించా రు. కానీ యూరియా సరిపడా ఉంద ని పాలకులు చెబుతున్నా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నా యి.
గద్వాల పీఏసీసీఎస్ ఎదుట శనివారం ఉదయం నుంచి యూరియా కోసం రైతులు నిరీక్షించారు. కేంద్రానికి 600 బస్తాల యూరియా రాగా.. సుమారు 300 మంది రైతులు తరలివచ్చారు. ఉదయం నుంచి యూ రియా కోసం పడిగాపులు కాశారు. అయితే గంటల తరబడి క్యూలో నిలబడలేక రైతులు కుటుంబ సభ్యులను వెంట తెచ్చుకొని కొద్దికొద్దిసేపు వరుసగా నిలబడ్డారు. కొందరైతే ఎండలో నే నేలపై కూర్చున్నారు. కొందరికి అందక నిరాశతో వెనుదిరిగారు.
అయిజ, ఆగస్టు 23 : యూరియా కోసం మూడ్రోజులుగా నిరీక్షించిన రైతులకు అరకొరగానే అందాయి. శనివారం అయిజ పీఏసీసీఎస్కు 1,200 బస్తాల యూరియా రాగా.. ఒక రైతుకు రెండు బస్తాల చొప్పున సిబ్బంది పంపిణీ చేశారు. అలాగే మండలంలోని చిన్న తాండ్రపాడు విండో కార్యాలయం వద్ద రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి పడిగాపులు కాశారు. కొందరు ఎండలో గంటల తరబడి నిలబడలేక నీరసంతో నేలపై కూర్చున్నారు. పోలీస్ పహారా మధ్య.. ఏవో జనార్దన్, సీఈవో మల్లేశ్ పర్యవేక్షణలో పంపిణీ చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకే స్టాక్ పూర్తి చేశారు. కార్యాలయానికి చెప్పులరిగేలా తిరుగుతున్నా ఫలితం లేకుండాపోయిందని పలువురు రైతులు వాపోయారు. ప్రస్తుతానికి వచ్చిన యూరియా అయిపోవడంతో మళ్లీ ఎప్పుడొస్తోందో తెలియని పరిస్థితి.
భూత్పూర్, ఆగస్టు 23 : భూత్పూరు పీఏసీసీఎస్ వద్దకు శనివారం తెల్లవారుజామునే రైతులు తరలివచ్చారు. పెద్ద ఎత్తున క్యూలైన్లు కట్టి.. యూరియా కోసం పడిగాపులు కాశారు. పూర్తిస్థాయి సరఫరా లేకపోవడంతో రైతులకు ఇక్కట్లు తప్పలేదు. పోలీసులు రంగప్రవేశం చేసి పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించారు. రైతుల వివరాలను సేకరించే మిషన్‌కు సర్వర్ ప్రాబ్లంతో పంపిణీ ఆలస్యమైంది. అయినా అధికారులు స్పందించలేదని పలువురు ఆరోపించారు. దీనికి తోడు యూరియా కొంటే నానో లిక్విడ్ యూరియా మందును అవసరం లేకున్నా.. బలవంతంగా అంటగట్టారని వాపోయారు.
పాలమూరు, ఆగస్టు 23 : మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని మన్యంకొండ స్టేజీ సమీపంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద రైతులు నిరీక్షించారు. గంటల తరబడి క్యూలో నిలబడినా.. వరుసలో చెప్పులు పెట్టినా.. ఒక రైతుకు రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. చాలా మందికి యూరియా అందకపోవడంతో పలువురు అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎరువులు పుష్కలంగా లభించాయమని, కాంగ్రెస్ పాలనలో యూరియా కష్టాలు మొదలయ్యాయని అన్నారు.