వనపర్తి,జూలై 22(నమస్తే తెలంగాణ) : రేవల్లి మండలకేంద్రంలో పదేళ్లుగా విద్యుత్ ఉద్యోగులను అనుసరించి కాల్ల లక్ష్మణ్ అనే వ్యక్తి గ్రామంలో కరెంట్ పనులను చక్కబెట్టేవాడు. ఓరైతు పొలంలో మోటరుకు ట్రాన్స్ఫార్మర్ నుంచి విద్యుత్ సరఫరా కాకపోవడంతో దానిని సరి చేయడానికి లక్ష్మణ్ వెళ్లాడు. ట్రాన్స్ఫార్మర్ ఏబీ స్విచ్ ఆఫ్ చేసి కేబుల్ వైర్ పరిశీలిస్తున్న క్రమంలో విద్యుత్‌షాక్‌కు గురై మృతిచెందాడు. ఇతడికి భార్య, ముగ్గురు సంతానం ఉండగా 2, 4, 6 తరగతులు చదువుతున్నారు. ఇంటి పెద్ద దిక్కు కోల్పోడంతో వీరి కుటుంబం బజారున పడింది. దీంతో గ్రామస్తులంతా గత నెలలో ధర్నాకు దిగితే అధికారులు ఆ ప్రమాదానికి రూ.5లక్షల విలువ కట్టి, రూ.2.50 లక్షలు ఇచ్చారు. ఇదిలా ఉంటే, విద్యుత్ శాఖ రికార్డుల్లో మాత్రం ఇప్పటి వరకు లక్ష్మణ్ మరణం నమోదు కాలేదు.
రేవల్లి మండలం శానాయిపల్లి గ్రామానికి చెందిన దుస్సు నాగయ్య, దుస్స నాగమ్మ కూలి పనులు చేసేవారు. అలాగే సీతాఫలాల సీజన్లో కాయల కోసం గుట్టలు, పొలాలు తిరుగుతూ వాటిని సేకరిస్తూ జీవనం సాగించేవారు. ఈ క్రమంలో గ్రామ శివారులో ఓరైతు అడవి పందుల కోసం పెట్టిన కరెంట్ తీగలకు తగిలి షాక్ గురై భార్యాభర్తలు మృతిచెందారు. వీరికి సెంటు భూమి కూడా లేదు. గత 2024 నవంబర్ 10వ తేదీన చోటుచేసుకున్న ఈ ఘటనలో ప్రైవేట్‌గా కొంత పరిహారం మాట్లాడి సగం వరకు ఇచ్చారు. ఇక శాఖ పరంగాను వీరి మరణం నమోదైనప్పటికీ ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారం మాత్రం ఏడాదిన్నర గడిచినా బాధితులకు అందక పోవడం బాధాకరం.
గోపాల్పేట మండల కేంద్రానికి చెందిన శివశంకర్ ఐదేండ్ల్లుగా స్పాట్ బిల్లర్‌గా పని చేస్తున్నాడు. గోపాల్పేట సబ్‌స్టేషన్ పరిధిలోని బుద్ధారం 11కేవీఏ ఫీడర్ ఫెయిల్ అయితే శివశంకర్‌ను ఆ లైన్‌పై అక్కడి విద్యుత్ సిబ్బంది పంపించారు. లైన్లో ఓచోట ఫాల్ట్ కనిపించడంతో సరిచేసేందుకు స్తంభం ఎక్కి జంపర్ల పనిచేస్తుండగా కరెంట్ షాక్ తగలడంతో స్తంభంపై నుంచి కింద పడి తీవ్రగాయాలపాలయ్యాడు. 40రోజుల పాటు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స తీసుకోవడంతో కోలుకున్నాడు. దవాఖానకు భారీగా ఖర్చు అవ్వడంతో సంబంధిత విద్యుత్ ఉద్యోగులను శివశంకర్ ఆర్థిక సాయం కోరాడు. దీనిపై సదరు ఉద్యోగులు చికిత్స ఖర్చులకు డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు.
చికిత్సకు డబ్బులు తీసుకున్నాడన్న నెపంతో అతను పనిచేస్తున్న స్పాట్ బిల్లింగ్‌కు కూడా దూరం పెట్టి బతుకుదెరువు లేకుండా చేశారు అధికారులు. చీకట్లను తొలగించాల్సిన విద్యుత్ శాఖ అనేక కుటుంబాల్లో మరణ మృదంగం మోగిస్తుంది. విద్యుత్ శాఖను అనధికారికంగా నమ్ముకుని పనిచేస్తున్న కార్మికులు, అమాయక ప్రజలు ఎందరో అకాల మరణాలతో అసువులు బాస్తున్నారు. ప్రకృతిపరంగా వచ్చే ప్రమాదాల సంగతి అంటుంచితే, విద్యుత్ ఉద్యోగుల తప్పిదాల కారణంగా అనేక మంది కార్మికుల ప్రాణాలు గాలి లో కలుస్తున్నాయి. గ్రామాల్లో ఏ చిన్న అవసరం పడినా వెంటనే వెళ్లే ప్రైవేట్ కార్మికుల బతుకులు బుగ్గిపాలవుతున్నాయి. మరికొందరు ప్రమాదాల్లో బలవుతున్నా.. విద్యుత్ అధికారులు, సిబ్బంది వారి చావుకు లెక్కగట్టి చేతులు దులిపేసుకుంటున్నారు.

మొక్కుబడి పరిహారంతో..
ప్రైవేట్ కార్మికులు కరెంట్ షాక్‌లతో చనిపోయినప్పుడు కేవలం మొక్కుబడిగా పరిహారం మాట్లాడుకుని మమ అనిపిస్తున్నారు. విద్యుత్ ఉద్యోగులు చేయాల్సిన పనులను ప్రైవేట్ వ్యక్తి చేస్తూ చనిపోయినప్పుడే ఇలా పరిహారం పేరుతో కొంత ముట్టజెప్పి తప్పించుకుంటున్నారు. గ్రామంలో ఉండే పెద్దలు, శాఖపరమైన అధికారులు రూ.2లక్షలు నుంచి రూ.5లక్షల వరకు ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు అందజేస్తున్నారు. దీంతో ప్రమాదాల్లో తీవ్రగాయాలపాలైన ఎందరో ప్రైవేట్ కార్మికుల జీవితాల్లో చీకట్లు కమ్ముకుంటున్నాయి.
వారి వైద్య ఖర్చులకు అంతో ఇంతో ఇచ్చి ఎవరికి వారు తప్పించుకుంటున్నారు. గ్రామాలు, పట్టణాల్లో పనిచేసే స్పాట్ బిల్లర్లు చాలా మంది ఈ కోవలో ఉన్నారు. విద్యుత్ ప్రమాదాలలో శాశ్వతంగా అంగవైకల్యం ఏర్పడిన అనేకమంది కార్మికులు జీవచ్చవంలా పడి ఉన్నారు. బాగా ఉన్నంత వరకు పని చేయించుకుని ఇలా ప్రమాదాలు జరిగితే మొక్కుబడి పరిహారం ఇచ్చి తప్పుకొంటున్నారు. చనిపోయిన మనుషులకు శాఖ పరంగా రూ.5లక్షలు ఇస్తుండగా, గొర్రెలు, మేకలకు రూ.7వేలు, గేదెలు,అవులకు రూ.40వేల వరకు ఇచ్చే అవకాశం ఉంది. దీని కోసం నిబంధనల ప్రకారం అన్ని సర్టిఫికెట్లు అందజేసిన వారికి మాత్రమే ఇవి అందుతాయి.అయితే, ఈ పరిహారానికి నోచుకొని వారు కూడా చాలా మంది ఉన్నారు.
గ్రామాల్లో ఉండరన్న విమర్శలు
విద్యుత్ శాఖ పరంగా గ్రామాల్లో ఉండాల్సిన సంస్థ ఉద్యోగులు గ్రామాల్లో అసలు ఉండటం లేదన్న విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. ఉద్యోగులు స్థానికంగా ఉండని క్రమంలో ప్రైవేట్ వ్యక్తులతో ఫోన్లోనే పనులను కానిస్తున్నారన్న వాదనలున్నాయి. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఉండాల్సిన ఉద్యోగులు
వారి స్థానాల్లో ఉండకపోవడంతోనే ప్రైవేట్ వ్యక్తులు
అధిక ప్రమాదాలకు కారణమవుతున్నా రు. ఇతర శాఖలకు, విద్యుత్ శాఖ పనులకు చాలా వ్యత్యాసం ఉంది. ఇతర ఉద్యోగులను పోల్చుకునే పరిస్థితి విద్యుత్ శాఖకు లేదు. ఓ 20 ఏండ్ల వెనక్కి వెళ్తే విద్యుత్ ఉద్యోగులు సహితం గ్రామాలు, మండల కేంద్రాల్లో కుటుంబాలతో సహ నివాసం ఉండి ఉద్యోగాలు చేసేవారు. అప్పట్లో ఇలా ఇన్ని ప్రమా దాలు..మరణాలు చోటుచేసుకున్న సందర్భాలు లేవు. కానీ పరిస్థితుల్లో వచ్చిన మార్పులతో రోజు.. రోజుకు ప్రమాదాలు పెరుగుతుండటం, మరణమృదంగంలా మారుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతుంది. మచ్చుకు కొందరు అక్కడక్కడ ఇప్పటికి గ్రామాల్లో ఉద్యోగాలను కొనసాగిస్తున్నారు.
స్పందించని డీఈ..
జిల్లాలో కరెంట్ షాక్‌లతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటనలు, రెండేళ్లయినా బాధిత కుటుంబాలకు పరిహారం అందని వాటిపై డీఈ శ్రీనివాస్‌ను ‘నమస్తే తెలంగాణ’ బుధవారం సాయంత్రం 4:45కు ఫోన్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఇందుకు ఆ అధికారి స్పందించ లేదు.
రెండేళ్లలో 35మంది..
జిల్లాలో రెండేళ్లలో జరిగిన విద్యుత్ ప్రమాదాలను పరిశీలిస్తే..మనస్సు తరుక్కుపోతుంది. అభం శుభం తెలియని అమాయక ప్రైవేట్ కార్మికులు, సంబంధం లేని ప్రజలు విద్యుత్ షాక్‌లతో మృత్యువాత పడుతూనే ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా విద్యు త్ శాఖ లెక్కలోకి వచ్చిన ఘటనలే 35మంది ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. వీరిలో ప్రైవేట్ కార్మికులుంటే, మరికొందరు ఎలాంటి సంబంధంలేని వారు కూడా షాక్‌లతో ప్రాణాలు కోల్పోయా రు. గ్రామాల్లో విద్యుత్ శాఖ పరిధిలో పనిచేసే స్పాట్ బిల్లర్లు అనేక చోట్ల ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు. వీరిలో కొందరు ప్రాణాలు కోల్పోతే మరికొందరు తీవ్ర గాయాలపాలై విగత జీవులుగా మిగిలిపోతున్నారు. కరెంట్ ఉద్యోగులు నియమించుకున్న ప్రైవేట్ కార్మికులు సహితం అసువులు బాస్తున్నారు. ఇలా కరెంట్ షాక్‌లతో మూగజీవాలు సహితం బలవుతున్నాయి. అలాగే ఈ రెండేళ్లలో మొత్తం 90పశువులు విద్యుత్ షాక్ వల్ల చనిపోయాయి. ఇదిలా ఉంటే, జిల్లాలో కరెంట్ షాక్‌లతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న సమాచారాన్ని రాష్ట్రస్థాయి అధికారులకు చేరవేయకుండా గోప్యత పాటించడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు తెలుస్తోంది. బాధితులు న్యాయం కోసం కోర్టు మె ట్లు ఎక్కినప్పుడు క్షేత్రస్థాయి అధికారులకు తెలిసి అవాక్కవుతున్నారు.