కల్వకుర్తి, జూలై 26 : వారం పది రోజులుగా కురుస్తున్న ముసురువర్షాలకు పైకప్పుతో పాటు, గోడలకు నీళ్లింకాయి. ఏ గోడ ముట్టుకున్నా తడి చేతులకు అం టుతుంది. పైకప్పు నుంచి వర్షం నీరు ఊరుతున్నది. ముందే పూర్తిగా శిథిలావస్థకు చెందిన పాఠశాల భవనం ముసురు వర్షాలకు మరింత దారుణంగా తయారైంది. సదరు పాఠశాల పైకప్పు కింద 66 మంది చిన్నారులు, నలుగురు ఉపాధ్యాయులు క్షణక్షణం భయం భయం గా కాలం వెల్లదీస్తున్నారు.
కల్వకుర్తి మండలం తర్నికల్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 1నుంచి 5వ తరగతి వరకు 66 మం ది విద్యార్థులు చదువుకుంటున్నారు. గతేడాది వరకు ఇక్కడ దాదాపు 150 మంది చదువుకున్నారు. పాఠశా ల శిథిలావస్థకు చేరుకోవడం, పైకప్పు ఊడి పడిపోతుండడంతో చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు భయబ్రాంతులకులోనై తమ పిల్లలను కల్వకుర్తిలోని ప్రైవేట్ పాఠశాలలకు పంపించారు. ఆర్థిక స్థోమత తక్కువగా ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు భగవంతుడిపై భారం వేసి తమ పిల్లలను గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు పంపుతున్నారు.
అసలే పైకప్పు ఊడిపోయి శిథిలావస్థకు చేరుకున్న పాఠశాల భవనం ముసురు వర్షాలతో మరింత దెబ్బతిన్నది. పాఠశాలలోని అన్ని గదుల గోడలకు వర్షం నీరు దిగి గోడలన్నీ తడిగా మారాయి. ఇదివరకే ఊడిపోయిన పైకప్పు పెచ్చుల నుంచి వర్షం నీరు కారుతున్నది. పైకప్పు కూడా పూర్తిగా తడిచిపోవడంతో ఎప్పుడు కూలుతుందోనన్న భయంతో ఉపాధ్యాయు లు, విద్యార్థులు బిక్కుబిక్కుమంటున్నారు. ప్రతి గది లో ఓ మూలకు విద్యార్థులను కూర్చోబెట్టుకొని వారికి పాఠాలు చెబుతున్నారు. తరగతిలోకి వెళ్తే చాలు తడిసిన గదుల ముక్క వాసన. గోడల నిండా మరకలతో దెయ్యాల కొంపను తలపిస్తున్నది.
శిథిలావస్థకు చేరిన ప్రాథమిక పాఠశాల స్థానంలో కొత్త భవనం నిర్మించేందుకు మన ఊరు- మన బడి పథకం కింద కేసీఆర్ ప్రభుత్వం రూ.69 లక్షలు మం జూరు చేసింది. కాంట్రాక్టర్ పనులు ప్రారంభించాడు. పైకప్పు(స్లాబ్) వేసే సమయంలో ఎన్నికలు వచ్చాయి. కొత్త ప్రభుత్వం వచ్చింది. అంతవరకు చేసిన పనులకు డబ్బులు రాకపోవడంతో కాంట్రాక్టర్ పనులను నిలిపివేశాడు. పనులు ఆగిపోవడంతో సదరు నిర్మాణ భవనం చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి విషజీవులకు నిలయంగా మారింది.
కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థుల మధ్యాహ్న భోజనానికి వంట గది, డైనింగ్ హాల్‌కు రూ.13 లక్షలు కేటాయించగా కాంట్రాక్టర్ పనులు పూర్తి చేశాడు. ప్రభు త్వం వంట గది నిర్మించిన కాంట్రాక్టర్‌కు రూ.4లక్షల వరకు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం మారడంతో నిధు లు ఆగిపోయాయి. పెండింగ్ బిల్లు చెల్లించకపోవడం తో సదరు కాంట్రాక్టర్ వంట గదిని పాఠశాలకు అప్పగించలేదు. దీంతో విద్యార్థులు మధ్నాహ్న భోజనాన్ని చెట్ల కింద కూర్చొని తినాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పాఠశాల శిథిలావస్థకు చేరుకున్నా.. ఏ అధికారి, ఏ ప్రజాప్రతినిధి కూడా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. ప్రమాదవశాత్తు ఏదైనా జ రిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. పాఠశాల నిర్మాణాల్లో కూడా రాజకీయాలేమిటని మండిపడుతున్నారు. అసంపూర్తిగా పాఠశాల భవన నిర్మాణ ప నులు ఎప్పటికి పూర్తి చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
ముసు రు వర్షాలు కురుస్తుండటంతో పిల్లలను బడికి పంపాలంటే భయం వేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు లాభం వచ్చే పనులకు నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుంటుందని, పాఠశాలల నిర్మాణం వల్ల ప్రభుత్వానికి లాభం రాదని ఉద్దేశంతోనే నిధులు ఇస్తలేరేమో అన్న అనుమానాలను గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో ఏదైనా ప్రమాదం జరిగితే ఈ ప్రాంత ఎమ్మెల్యే, పక్క ఊరికి చెందిన సీఎం బాధ్యత వహించాల్సి వస్తుందని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.