మహబూబ్‌నగర్, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/జడ్చర్ల, సెప్టెంబర్ 24 : ఉమ్మడి మహబూబ్‌గర్ జిల్లాలో రా ష్ట్ర మంత్రులు పెండింగ్ ప్రాజెక్టుల సందర్శన రైతుల పాలి ట శాపంగా మారింది. మంత్రుల పర్యటనకు అడ్డు తగులవద్దని ఏకంగా రైతులను ఠాణాకు పిలిపించిన ఘటన మ హబూబ్‌నగర్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. బుధవారం రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రా జనర్సింహ, జూపల్లి కృష్ణారావుతోపాటు ఎమ్మెల్యేలు ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాలోని ప్రాజెక్టులను పరిశీలించనున్నారు.
ఈ నేపథ్యంలో జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామంలో చేపడుతున్న రిజర్వాయర్ కింద భూములు కోల్పోతున్న రైతులను మంగళవారం జడ్చర్ల పోలీసులు స్టేషన్‌కు రావాలని హుకూం జారీ చేశారు. దీంతో ఆందోళన చెందిన రైతు లు ఉదండాపూర్ రిజర్వాయర్ కింద ముంపునకు గురవుతున్న గ్రామాల రైతులంతా మూకుమ్మడిగా జడ్చర్ల పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.
అక్కడ రైతులు పోలీసులకు మధ్య కాసేపు వాగ్వాదం జరగడంతో చివరకు వారిని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌కు తరలించి అక్కడ చర్చలు జరిపారు. అయితే రైతులంతా తమను అరెస్టు చేసి జైల్లో పెట్టి పనులు చేసుకోండని పోలీసులకు సవాల్ విసరడంతో పరిస్థితి అదుపు తప్పింది. చివరకు రైతులను ఒప్పించి మంత్రుల పర్యటనను అడ్డు తగులవద్దని పోలీసులు, రెవెన్యూ యంత్రాం గం హుకూం జారీ చేయడం గమనార్హం.
మహబూబ్‌నగర్ జిల్లాలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద ఉదండాపూర్ రిజర్వాయర్ పంప్‌హౌస్ నిర్మాణం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. అయితే ప్రభుత్వం నచ్చజెప్పి మల్లన్నసాగర్‌కు ఇచ్చిన విధంగానే రైతులకు పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చి పనులు ప్రారంభించింది. ఆ తర్వాత అనేక అడ్డంకులు రావడంతో డి మాండ్లు పెరగడంతో పరిహారం విషయంలో జాప్యం జరిగింది.
ఈ లోపు ప్రభుత్వం మారడంతో స్థానిక ఎమ్మెల్యే ఇటీవల ఉదండాపూర్ రిజర్వాయర్‌ను సందర్శించి ముం పునకు గురవుతున్న గ్రామాల రైతులతో చర్చలు జరిపారు. గత ప్రభుత్వం హామీలను మరిచిందంటూ ఈసారి తమ ప్రభుత్వంతో మల్లన్నసాగర్లో రైతులకు ఇచ్చిన ప్యాకేజి ఇప్పిస్తానని, లేకుంటే తానే మీ తరఫున ఆందోళన చేస్తామ ని హామీ ఇచ్చి వచ్చారు. ఈలోపు ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టుల సందర్శనకు మంత్రుల బృందం పర్యటన ఖరారైంది.
ఎమ్మెల్యే హామీ ఏమైందో కానీ హఠాత్తుగా మంగళవారం ఉదండాపూర్ రిజర్వాయర్ కింద ముంపు గ్రామాల్లోని కొంతమంది రైతులకు జడ్చర్ల పోలీస్ స్టేషన్ నుంచి పిలుపు వచ్చింది. మంత్రులను నిలదీస్తారని ఉద్దేశంతో కొందరు రైతులను స్టేషన్‌కు పిలిపించి పర్యటన సాఫీగా జరిపేందుకు పోలీసులు ఉత్సాహం ప్రదర్శించడం పలు విమర్శలకు తా విస్తోంది. ఈలోపు రెవెన్యూ అధికారులు కూడా రంగంలో దిగి రైతులను నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు.
మంత్రుల పర్యటనకు అడ్డువస్తారని నేపథ్యంలో కొంతమంది రైతులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించడంతో ఉదండాపూర్ రిజర్వాయర్ కింద ముంపునకు గురవుతున్న నా లుగు గ్రామాల ప్రజలు జడ్చర్ల పోలీస్ స్టేషన్‌కు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కేవలం అడ్డు తగులుతారనే నేపథ్యంలో నలుగురు రైతులను పిలిపిస్తే ఇంతమంది ఎందుకు వచ్చారని పోలీసులు ప్రశ్నించారు. ఇదంతా మా గ్రామాల సమ స్య అందుకోసమే అందరం కలిసి వచ్చామని జవాబు ఇ చ్చారు.
ఈలోపు కావాలని పోలీసులు తమను పిలిచి అ రెస్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారని తెలిసి స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చివరకు పోలీస్‌స్టేషన్‌లో కాకుండా ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ వద్ద అధికారులతో మాట్లాడుదామని అక్కడికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు జడ్చర్ల తాసీల్దార్లు రైతులతో మాట్లాడుతూ మంత్రుల పర్యటనకు అడ్డుతగులవద్దని ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలని సూచించారు. అవసరమైతే మంత్రులను కల్పిస్తామని వినతిపత్రాలు ఇచ్చుకోవచ్చని సలహా ఇచ్చారు.
రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, ఎక్సైజ్, పర్యాటకశాఖల మంత్రి జూపల్లి కృష్ణారావుతో కూడిన మంత్రుల బృందం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నది. ముందుగా జడ్చర్ల మండలం ఉదండాపూర్‌కు హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. అక్కడ రిజర్వాయర్ పరిశీలన అ నంతరం నేరుగా గద్వాల జిల్లా గట్టు ఎత్తిపోతల పథకాన్ని, అక్కడి నుంచి వనపర్తి జిల్లాలోని శంకర సముద్రం రిజర్వాయర్‌ను, ఆ తర్వాత పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కొల్లాపూర్ సమీపంలోని నార్లాపూర్, నాగర్‌కర్నూల్ సమీపంలోని వట్టెం పంప్‌హౌస్‌లను పరిశీలిస్తారు. అనంతరం నాగర్‌కర్నూల్ కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఆయా జిల్లాల కలెక్టర్లు, సాగునీటి పారుదల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
ఉదండాపూర్ రిజర్వాయర్ కింద తమకు గత ప్రభు త్వ హామీ ఇచ్చిన విధంగా మల్లన్నసాగర్ సలహాలోని నష్టపరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేశారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇతరత్రా సమస్యలు రెవెన్యు పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. నష్టపరిహారం చెల్లించాకనే పనులు ప్రారంభించాలని అంతవరకు పనులను చేపట్టవద్దని అల్టిమేట్ జారీ చేశారు. సర్కారు అంగీకరించకపోతే తమను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి పనులు ప్రారంభించుకోండని అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పరిహారం కోసం ఉన్న పొలాలను వదిలిరోడ్డున పడుతున్నా ప్రభుత్వాలు కనికరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆందోళనకారులుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. తమ డిమాండ్లను ఒప్పుకుంటేనే పనులు చేపట్టవచ్చని లేకపోతే పనులు జరగనివ్వబోమని హెచ్చరించారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో 18 ఏండ్లు నిండిన యువకులను కూడా ప్రత్యేకంగా గుర్తించాలని వారికి కూడా ఇంటి ప్లాట్‌తోపాటు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. కొంతమంది కట్టుకున్న ఇండ్లకు ప్లాట్లకు డాక్యుమెంట్లు లేవని వాటినీ పరిగణలోకి తీసుకొని నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో డీఎస్పీ, తాసీల్దార్ నచ్చజెప్పి మంత్రులకు వినతిపత్రం అందించడంతోపాటు పర్యటనను విజయవంతం చేయాలని కోరడం కోస మెరుపు. మంత్రుల పర్యటన కోసం అధికార యంత్రాంగం రైతులను ఒప్పించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.