Palamuru University | మహబూబ్ నగర్ కలెక్టరేట్, మార్చి 27 : పాలమూరు విశ్వవిద్యాలయ ఉగాది పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎటు చూసినా పచ్చని తోరణాలు.. రంగురంగుల పూలతో అలంకరించిన విభాగాల ముఖద్వారాలు.. సంస్కృతి, సంప్రదాయ దుస్తులతో విద్యార్థినీ, విద్యార్థులు.. అధ్యాపకులు.. విభాగాధిపతులు.. సంతోషాల హరివిల్లులా విశ్వవిద్యాలయంలో గురువారం గ్రామీణ ప్రాంతాల్లోని పండగ వాతావరణం కళ్లకు కట్టింది. షడ్రుచులతో తయారు చేసిన ఉగాది పచ్చడి, మామిడితో చేసిన పులిహోర, భక్ష్యాలు పంచుతూ,ఆనందాన్ని ఆస్వాదిస్తూ తెలుగు వారి తొలి పండగను ఘనంగా జరుపుకున్నారు.
పాలమూరు యూనివర్సిటీ లైబ్రరీ ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉగాది-2025 వేడుకలను పీయూ వైస్ చాన్స్లర్ జీఎన్ శ్రీనివాస్, అఖిల భారత సహ సంఘటన కార్యదర్శి గుంత లక్ష్మన్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి, చదువుల తల్లి సరస్వతికి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. ఆది మానవుడి నుంచి ఆధునిక మానవుడి జీవితానికి అన్ని వేళల ఆయువు పోస్తున్న ప్రకృతి ప్రసాదించిన షడ్రుచుల సమ్మేళనమే ఉగాది అని పేర్కొన్నారు. ఉగాది పచ్చడిలో కనిపించే షడ్రుచులు జీవితంలో కష్టసుఖాలను సమానంగా తీసుకోవాలి అనే సూచిస్తాయన్నారు.
విశిష్ట అతిథి గుంత లక్ష్మన్ మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించి భవిష్యత్ తరాలకు అందించాలన్నారు. సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినప్పటికీ మనం వచ్చిన మూలాలే మర్చిపోకూడదన్నారు. భారతీ సంస్కృతిలో భిన్నత్వంలో ఏకత్వం ఉందన్నారు.
అంతకుముందు విద్యార్థిని విద్యార్థులు పలు సాంస్కృతిక జానపద గేయాలు నృత్యాలతో అలరించారు. ఈ కార్యక్రమాల్లో పీయూ ఇంఛార్జి రిజిస్ట్రార్ మధుసూదన్ రెడ్డి, పరీక్షల నిర్వహణ అధికారి రాజ్ కుమార్, తెలుగు శాఖ అధ్యక్షురాలు డా. నెమ్మికంటి సంధ్యారాణి, తెలుగు విభాగం అధ్యాపకులు డా. రవీందర్ గౌడ్, రాఘవేంద్రరావు, తిరుపతయ్య, పీజీ, ఫార్మసీ, కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కళాశాలల ప్రిన్సిపల్స్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, పీయూ బోధనేతర సిబ్బంది ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జే.రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.