గండీడ్, నవంబర్ 1 : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన మండలంలో గురువారం చోటుచేసుకున్నది. మహ్మదాబాద్ ఎస్సై శేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన బోరు రవి(19) కొండాపుర్ నుంచి గురువారం సల్కర్‌పేట్ వైపు వస్తుండగా కుల్కచర్ల మండలం పటేల్చెరువుతండాకు చెందిన ఇస్లావత్ రవి(30) సల్కర్‌పేట్ నుంచి పగిడ్యాల్ వైపు వస్తుండగా మన్సూర్‌పల్లి గేటు సమీపంలో వారి బైక్‌లు వేగంగా ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి.
ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. కొండాపూర్ గ్రామానికి చెందిన మృతుడు బోరు రవి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. పండుగ పూట జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా ఆయా గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.