పెద్దమందడి, ఆగస్టు 28 : ఆర్టీసీ బస్సును నిర్లక్ష్యం గా నడిపి రెండు ప్రాణాలను బలిగొన్న ఘటన వనపర్తి జిల్లాలోని పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లిలో చోటుచేసుకున్నది. పామిరెడ్డిపల్లికి చెందిన బో య అశోక్ (23), బోయ చందు(23) ముందరితండా నుంచి స్వగ్రామానికి బైక్పై వస్తుండగా, వనపర్తి నుంచి మహబూబ్నగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు పామిరెడ్డిపల్లి సమీపంలో బైక్ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో అశోక్, చందు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు కోపోద్రిక్తులై బస్సు అద్దాలను ధ్వంసం చేసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వర్రావు, ఆర్టీవో పద్మావతి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రభుత్వం తరుఫున న్యాయం చేసేందుకు సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
అదేవిధంగా బస్సు యజమా ని, ఆర్టీసీ వారితో మాట్లాడి పరిహారం ఇప్పించేలా కృషి చేస్తామన్నారు. అయినప్పటికీ గ్రామస్తులు వినకుండా బీష్మించుకు కూర్చున్నారు. చివరకు ప్రభుత్వపరంగా ఆదుకుంటామని ఎమ్మెల్యే ఫోన్లో గ్రామస్తులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన మృతదేహాలను చూసి బాధితుల రోధనలు మిన్నంటాయి. కేసు న మోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.