మూసాపేట(అడ్డాకుల), అక్టోబర్ 11 : తల్లి సంవత్సరికానికి వచ్చి ప్రమాదవశాత్తు చెక్‌డ్యాంలో పడి ఇద్దరు కుమారులు మృతిచెందిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం బ లీదుపల్లిలో చోటుచేసుకున్నది. ఎస్సై శ్రీనివాసులు, స్థానికుల వివరాల ప్రకారం.. బలీదుపల్లికి చెందిన మంద యాదయ్య, మణెమ్మ దంపతులకు నలుగురు కుమారులు. హైదరాబాద్‌లో ఉంటూ అక్కడే ఆటోలు నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నారు.
గతేడాది మణెమ్మ మృతిచెందింది. ప్రథమ వ ర్ధంతి సందర్భంగా గురువారం నలుగురు కుమారులు గ్రా మానికి వచ్చారు. శుక్రవారం సంవత్సరికం చేశారు. శనివారం పూజ చేసిన పూలు, ఇతర సామగ్రిని గ్రామ సమీపంలోని చెక్‌డ్యాం నీటిలో కలిపేందుకు వెళ్లారు. ప్రమాదవశాత్తు నలుగురిలో పెద్ద కుమారుడు మంద సుధాకర్ కా లుజారి చెక్‌డ్యాంలో పడిపోయాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో వరదలో కొట్టుకుపోయాడు. గమనించిన చిన్న కుమారుడు మంద సాయి (జగన్) (22) సుధాకర్‌ను కాపాడేందుకు చెక్‌డ్యాంలోకి దూకాడు.
నీటి ప్రవాహంలో వచ్చిన సుడిలో పడి ఇద్దరూ మునిగిపోతుండగా మిగిలిన వారు అక్కడే ఉన్న అడ్డపంచె సాయంతో బయటకు లాగారు. అప్పటికే మంద సుధాకర్ అపస్మారక స్థితికి చేరుకోగా, మందసాయి శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్నాడు. వెంటనే అంబులెన్స్‌కు ఫోన్‌చేసి జిల్లా దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు ఇద్దరూ మృతిచెందినట్లు నిర్ధారించారు. సుధాకర్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సాయికి వివాహం కాలేదు. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతిచెందడంతో కుటుంబీకుల రోధనలు మిన్నంటాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.