మాగనూరు : పండగపూట నారాయణపేట( Narayanapeta ) జిల్లాలో విషాదం నెలకొంది. మాగనూరు కృష్ణ మండలాలలో బుధవారం రెండు వేరువేరు ప్రమాదాల ( Accidents) లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.మాగనూరు మండల కేంద్రంలో మక్తల్ నుంచి కొత్తపల్లి గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న తండ్రి, కొడుకులను కర్ణాటక రాష్ట్రం నుంచి మక్తల్ వైపు ఎదురుగా వస్తున్న కారు అతివేగంతో ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన తండ్రి లోకపల్లి లక్ష్మప్ప (60) చికిత్స పొందుతు మృతి చెందాడు. కొడుకు భీమేష్ తీవ్ర గాయాలై కాలు విరగడంతో మెరుగైన చికిత్స నిమిత్తం మహబూబ్నగర్ ఆసుపత్రికి తరలించారు. కారులో ఉన్న ఐదు మందికి తీవ్ర గాయాలు కాగా కారు డ్రైవర్ పరిస్థితి విషమించడంతో రాయచూర్ ఆసుపత్రికి తరలించారు.
పండుగకు వచ్చి పరలోకానికి ..
కృష్ణ మండలం గుడెబల్లూరు వద్ద జరిగిన మరో ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. అత్తగారింటికి వచ్చిన అల్లుడు నేతాజీ పని నిమిత్తం బైక్పై వేరే గ్రామానికి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ నివాసి నేతాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో ఆకర్షణ్ అనే యువకుడికి గాయాలు కావడంతో అతడిని మక్తల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.