నీట మునిగి ఇద్దరు చిన్నారులు మృతి
ఉండవెల్లి, జూన్ 8 : జములమ్మ పండుగతో కళకళలాడుతున్న ఆ కుటుంబాల్లో విషాదం నెలకొన్నది. ఇద్దరు చిన్నారుల మృతితో ఆ కుటుంబాలు కన్నీటి సంద్రంలో మునిగిపోయాయి. స్థానికులు, గ్రామస్తుల కథనం మేరకు.. మండలంలోని మారుమునగాల గ్రామానికి చెందిన సాంబశివుడు, నర్సమ్మ దంపతుల కూతురు చరిత(11) నాలుగో తరగతి పూర్తి చేసి ఐదో తరగతి కోసం గురుకుల పాఠశాల ప్రవేశ ప రీక్ష రాసింది. అలాగే నాగశేషి, శకుంతలమ్మ దంపతుల కూ తురు మాధవి(9). అయితే బుధవారం రోజు ఇద్దరు చిన్నారులతోపాటు వీరి సమీప బంధువులైన వసంత, ఇందు, జ్ఞాపిక, అమ్ములు, నితిన్, పల్లవి, చింటుతోపాటు నారాయణపురం నరసింహతో కలిసి సరదాగా గడపాలని కారులో ప క్కనే ఉన్న కృష్ణానదికి వెళ్లారు.
అక్కడ ఆహ్లాదంగా గడుపుతూ సెల్ఫీలు దిగారు. ఈ క్రమంలో మాధవి, చరితతో మరో ఇద్దరు నీటిలో నుంచి అవతలి వైపునకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. వెంటనే అప్రమత్తమైన నరసింహ ఇద్దరిని రక్షించాడు. మాధవి, చరిత నీటిలో గల్లంతయ్యారు. వెంటనే ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేయడంతో వారు అక్కడికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. జాలర్ల సాయంతో ఇద్దరు చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు. దీంతో రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. చిన్నారుల తల్లిదండ్రులు సొమ్మసిల్లిపోయారు. ఒకే గ్రామంలో ఇద్దరు చిన్నారులు చనిపోవడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను అలంపూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.