అచ్చంపేట రూరల్: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట (Achampet) మండలం చెదురుబావి తండాలో విషాదం చోటుచేసుకున్నది. పొలంలో నీరు పెట్టేందుకు వెళ్లిన ఇద్దరు రైతులు విద్యుత్ షాక్తో మృతిచెందారు. చెదురుబావి తండాకు చెందిన కాట్రవత్ లూక్యా, మూడవత్ కుమార్ వరి నీరు పెట్టేందుకు బుధవారం సాయంత్రం పొలం వద్దకు వెళ్లారు. అయితే బావిలో ఉన్న బోరు పనిచేయక పోవడంతో విద్యుత్ వైరు చెడిపోయినట్లు గుర్తించారు. ఈ క్రమంలో వైరును బాగు చేసేందుకు బావిలోకి దిగారు. ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గురవడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.
అయితే రాత్రి పొద్దుపోయినప్పటికీ ఇద్దరు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. అయితే గురువారం ఉదయం బావిలో వారి మృతదేహాలు కనిపించడంతో.. పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని అచ్చంపేట ఎస్ఐ రమేశ్ తెలిపారు.