ధరూరు, సెప్టెంబర్ 15 : జూరాల డ్యాం సమీపంలో కృష్ణానదిపై నిర్మించనున్న హైలెవల్ బ్రిడ్జి కోసం రెండు జిల్లాలకు చెందిన రైతులు ఆందోళనకు దిగా రు. వనపర్తి జిల్లా నందిమల్ల, జోగుళాంబ గద్వాల జిల్లా రేవులపల్లి వాసులు సోమవారం పీజేపీ వద్దకు చేరుకొని రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నదిపై నిర్మించిన జూరాల ప్రాజెక్టు భద్రతా కారణాల రీత్యా నూతనంగా హైలెవెల్ బ్రిడ్జిని రూ.121.92 కోట్లతో నిర్మించాలని ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు.
ఆ సమయంలో ప్రాజెక్ట్ దిగువన ఉన్న రేవులపల్లి నుంచి నందిమల్ల వరకు వంతెన నిర్మించాలని అధికారులు నిర్ణయించారని పేర్కొన్నారు. తీరా చూస్తే గద్వాల మండలం కొత్తపల్లి నుంచి వనపర్తి జిల్లా ఆత్మకూరు వరకు కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారని మండిపడ్డారు. ఒక్కసారిగా డిజైన్ ఎందుకు మార్చారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోయింది. పాత జీవో మేరకే బ్రిడ్జి నిర్మించాలని, లే కుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అయితే డిజైన్ మార్పునకు మంత్రి వాకిటి శ్రీహరి పావులు కదుపుతున్నారని రైతులు ఆరోపించారు.