Kollapur | కొల్లాపూర్ : జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కారం చేయకుంటే భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యచరణ రూపొందించి కార్యాలయాలను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. గురువారం కొల్లాపూర్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట జరుగుతున్న జర్నలిస్టుల రిలే నిరాహార దీక్షలు రెండవ రోజుకు చేరుకున్నాయి. రెండవ రోజు దీక్షలను టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు తాటికొండ కృష్ణ ప్రారంభించారు. ఈ దీక్షలో టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు రామచంద్రం నియోజవర్గ కన్వీనర్ జలకం మద్దిలేటి, టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాయకులు మల్లికార్జున, సీనియర్ జర్నలిస్టులు బచ్చలకూర కురుమయ్య, సిపి నాయుడు, రమణ, రామకృష్ణ, వెంకట రాములు, శివ కేశవులు, గోవిందు, స్వాములు, తరుణ్, మల్లేష్, సురేంద్ర తదితరులు కూర్చున్నారు.
దీక్ష శిబిరానికి సంఘీభావంగా బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంతటి నాగన్న, బీఎస్పీ జిల్లా కోశాధికారి బంకలి దాసు, బీఎస్పీ జిల్లా నాయకులు కళ్యాణ్, మునిస్వామిలు మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలన్నారు. సమస్యలు పరిష్కారం కాకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. ఆవోపా, వాసవి క్లబ్ అధ్యక్షులు ప్రేమ్ కుమార్‌లు మాట్లాడుతూ ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. బీఆర్ఎస్వీ శేఖర్, బిఆర్ఎస్ ఎస్సీ సెల్ డికె మాదిగ ఎన్జీవో అధినేత కలబంద శేఖర్లు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇచ్చిన ప్రొసీడింగ్ ప్రకారం ఇండ్ల స్థలాలు ఇవ్వాలని స్థానిక మంత్రి జర్నలిస్టులపై కక్షపూరిత వైఖరి చూపిస్తున్నారని వారు మండిపడ్డారు.
రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బాల్ రెడ్డి మాట్లాడుతూ.. జర్నలిస్టుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. 20 నుంచి 30 సంవత్సరాల నుంచి జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కాకపోవడం చాలా అన్యాయం అన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పాలకులు జర్నలిస్టులను వాడుకొని వదిలేసిందన్నారు.
బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చిన్నా రెడ్డి, మాజీ జెడ్పీటీసీ వెంకటరమణమ్మలు మాట్లాడుతూ.. జర్నలిస్టుల న్యాయమైన సమస్యలను మంత్రి జూపల్లి కృష్ణారావు పట్టించుకోకపోవడం సరైనది కాదన్నారు. జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్యం మొండి వైఖరిని వీడాలని వారు డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా పరిధిలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వచ్చాయన్నారు. కానీ మంత్రి నియోజక వర్గంలో జర్నలిస్టులకు ఇండ్లు ఇండ్ల స్థలాలు లేకపోవడం విచారకరమన్నారు. వెంటనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలన్నారు. న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం జర్నలిస్టులు చేసే పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని వారు పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ ఎంపీపీ గాదెల సుధారాణి మాట్లాడుతూ.. జర్నలిస్టులు చేస్తున్న దీక్షలు న్యాయమైనదని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ దృష్టికి మంత్రి దృష్టికి తీసుకొని వెళ్లి సమస్యను పరిష్కారం దిశగా కృషి చేస్తామన్నారు. కెవిపిఎస్ జిల్లా నాయకులు అశోక్ మాట్లాడుతూ చిన్న చిన్న ఉద్యోగస్తులకు కూడా పిఎఫ్ లు ఉన్నాయి కానీ జర్నలిస్టులకు ఎలాంటి భద్రత సౌకర్యాలు లేవన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కార అయ్యేంతవరకు మా సంఘం మద్దతు ఎప్పుడు ఉంటుంది అన్నారు. బీఎస్పి నాయకులు, ఆవోపా నియోజవర్గ ప్రధాన కార్యదర్శి అర్థం రవి, నాయకులు బ్రహ్మయ్య , చందన శ్రీను, భజరంగదల్ నాయకులు పులి భరత్, బాలు వాసవి క్లబ్, బీఆర్ఎస్వీ, బిఆర్ఎస్ ఎస్సీ సెల్, ఎన్జీవో సంఘాలు, ప్రముఖ డాక్టర్ రామచంద్రంలు, ఏబీవీపీ నాయకులు భరత్ యాదవ్ మద్దతు ప్రకటించారు.