అయిజ, డిసెంబర్ 7 : కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం క్రస్ట్‌గేట్ల బిగింపు పనులు వచ్చే ఏడాది జూన్‌లోగా పూర్తి చేసేందుకు కర్ణాటకలోని తుంగభద్ర బోర్డు ఇంజినీర్లు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం డ్యాంలోని 19వ గేటు గత ఏడాది ఆగస్టులో డ్యాంకు వచ్చిన భారీ వరకు కొట్టుకుపోయింది. దాని స్థానంలో స్టాప్‌లాక్ గేటును తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. అలాగే మరో 32 క్రస్ట్‌గేట్ల పరిస్థితిని అధ్యయనం చేసిన నిపుణుల కమిటీ డ్యాంలోని మొత్తం 33 పాత గేట్లను మార్చాలని సూచించింది. అందులో భాగంగా టీబీ బోర్డు రూ. 52 కోట్ల వ్యయంతో 33 క్ర స్ట్గేట్లు కొత్తవి ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నది. కొత్త క్రస్ట్‌గేట్లు 50 ఏళ్లు వచ్చేలా గేట్ల నిర్మాణం పనులు కర్ణాటకలోని గదగలో చేపట్టారు. తుంగభద్ర డ్యాంలో కొన్ని గేట్లు తయారు చేస్తుండగా, మరి కొన్ని గేట్ల ను గదగలో తయారు చేస్తున్నారు.
గుజరాత్‌కు చెందిన కంపెనీ క్రస్ట్‌గేట్లను తయారు చేస్తోంది. ఆరవై అడుగుల వెడల్పు, 20అడుగుల ఎత్తుతో గేట్లను నిర్మిస్తున్నారు. కొత్త గేట్ల బిగింపు, గేట్ల తరలింపు సులువుగా ఉంటుందని తుంగభద్ర డ్యాం సమీపంలోనే నిర్మాణం చేయిస్తున్నారు. ఇప్పటికే 15 కొత్త క్రస్ట్‌గేట్లను పూర్తి చేసి, డ్యాం సమీపంలోకి తరలించారు. మ రో 18కొత్త క్రస్ట్‌గేట్లు త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు బోర్డు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం డ్యాంలో నీటి నిల్వలు తగ్గుతుండడంతోపాత గేట్ల తొలగింపు పనులను ఇంజినీరింగ్ నిపుణుల పర్యవేక్షణలో కార్మికులు తొలగింపు పనులు ముమ్మరం చేశారు. డ్యాంలో నీటి నిల్వలు 40 టీఎంసీల వరకు తగ్గితే పనులు మరింత వేగిరంగా చేపట్టేందుకు తుంగభద్ర బోర్డులోని ఇంజినీరింగ్ నిపుణుల బృందం ప్రణాళికలు రూపొందించింది. టీబీ బోర్డు కార్యదర్శి రామకృష్ణారెడ్డి, ఎస్ఈ నారాయణ్‌నాయక్, ఈఈ చంద్రశేఖర్‌లు పాత గేట్ల తొలగింపు పనులు పర్యవేక్షణ చేస్తున్నట్లు సెక్షన్ అధికారి కిరణ్‌కుమార్ తెలిపారు.
కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంలో వచ్చే ఏడాది పూర్తిస్థాయి నీటి నిల్వలు పెంచేందుకు టీబీ బోర్డు కసరత్తు చేస్తోంది. గత ఏడాది డ్యాంలోని 19వ క్రస్ట్‌గేటు భారీ వరదలకు కొట్టుకుపోవడంతో ఈ ఏడాది వానకాలంలో 80 టీఎంసీలకు మించి నీటి నిల్వ చేయలేదు. 105 టీఎంసీల సామర్థ్యం కలిగిన డ్యాంలో నీటి నిల్వ తగ్గించడంతో మూడు రాష్ర్టాల ఆయకట్టు రైతులు సాగునీటికి, తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
డ్యాం గేట్ల సామర్థ్యం దెబ్బతిన్నదని ఇంజినీరింగ్ నిపుణుల కమిటీ సూచించడంతో అందుకనుగుణంగా డ్యాంలో నీటి సామర్థ్యం త గ్గించారు. డ్యాంలో నీటి నిల్వలు తగ్గించడంతో తుంగభద్ర డ్యాం పరీవాహక ప్రాంతంలో ఈ ఏడాది యాసంగిలో పంటలకు క్రాప్ హాలిడే ప్రకటించారు. కర్ణాటక, ఏపీ, తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లా, అలంపూర్ నియోజకవర్గంలోని పంట పొలాలకు తుంగభద్ర జలాలు అందుతున్నాయి. అలంపూర్ నియోజకవర్గంలోని 87,500 ఎకరాల ఆయకట్టుకు తుంగభద్ర జలాలను కేటాయించారు. మూడు రాష్ర్టాల్లోని ఆయకట్టుకు వరదాయనిగా తుంగభద్ర డ్యాం నీటిని అందిస్తోంది.