పెద్దమందడి, డిసెంబర్ 7 : సీఎం కప్ క్రీడా పోటీల్లో విషాదం చోటు చేసుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో పాల్గొన్న ఓ విద్యార్థి కుప్పకూలిపోయాడు. ఉపాధ్యాయులు దవాఖానకు తరలించేలోపే మృతి చెందిన సంఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. పెద్దమందడి మండలం బలిజపల్లి, జంగాయపల్లి జంట గ్రామాల ఉన్నత పాఠశాలలో సీఎం కప్ పాఠశాల స్థాయి క్రీడా పోటీలను నిర్వహించారు.
అదే పాఠశాలలో చదువుతున్న ముందరితండా (పామిరెడ్డిపల్లితండా)కు చెందిన 10వ తరగతి విద్యార్థి సాయిప్రణీత్ (16) శనివారం వాలీబాల్ ఆడుతూ కళ్లు తిరుగుతున్నాయని చెప్పి కిందపడిపోయాడు. వెంటనే ఉపాధ్యాయులు వారి సొంత వాహనంలో వనపర్తి దవాఖానకు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే ఉదయం ఒకసారి కం డ్లు తిరుగుతున్నాయని విద్యార్థి చెప్పడం తో అతడి తల్లి లీలమ్మ దవాఖానకు చూ పించి పాఠశాలకు పంపించింది. ఈ క్రమంలో ఆటలు ఆడుతుండగా.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
సాయి 6వ తరగతి నుంచి అదే పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. తండ్రి రవి దుబాయిలో ఉంటుండగా.. అతడి తల్లితో కలిసి తండాలో ఉంటున్నాడు. ఇతడికి అక్క, తమ్ముడు ఉన్నారు. విద్యార్థి మృతితో తండాలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ విషయంపై పాఠశాల హెచ్ఎం మంజులతను ఫోన్లో వివరణ కోరగా.. తర్వాత ఫోన్ చేస్తానంటూ కట్ చేసింది. అదేవిధంగా విద్యార్థి సాయిప్రణీత్ ఒక్కసారిగా కుప్పకూలిన సంఘటనను చూసిన మరో విద్యార్థిని ప్రియ అపస్మారక స్థితికి వెళ్లగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.