అలంపూర్ చౌరస్తా, అక్టోబర్ 16 : ఏపీలోని కర్నూల్ జిల్లాలో గురువారం ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. తెలంగాణ, ఏపీ పోలీసులు భారీ బందోబస్తు కోసం వాహనాల తనిఖీ చేయడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఏపీలోని కర్నూల్ వైపు, తెలంగాణలోని ఉండవెల్లి మండలం పుల్లూరు నుంచి అలంపూర్ చౌరస్తా వరకు హైవే-44పై దాదాపు 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామైంది. దీంతో దాదాపు 5గంటలపాటు వాహనాలు క్యూ కట్టాయి. హైదరాబాద్ నుంచి కడప, బెంగుళూరు, నంద్యాల, తిరుపతి, అనంతపూర్‌కు వెళ్లే వాహనాలను అలంపూర్ మీదుగా వంతెన ద్వారా ఏపీకి మళ్లించారు.
కర్నూల్ వైపు నుంచి వచ్చే వాహనాలను నిలిపివేశారు. తర్వాత రాత్రి వరకు ట్రాఫిక్‌ను పోలీసులు క్లియర్ చేశారు. పుల్లూరు నుంచి మానవపాడు మండలం వరకు జాతీయ రహదారిపై వేల సంఖ్యలో లారీలు, బస్సులు, ఆటోలు, ట్రాలీ ఆటోలు బారులుతీరాయి. ప్రయాణికులు, చిన్నపిల్లలకు తాగేందుకు నీళ్లు కూడా దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చేసేది లేక కొందరు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి హోటళ్లలో భోజనం, స్నాక్స్ తిని ఆకలి తీర్చుకున్నారు.