మహబూబ్‌నగర్, అక్టోబర్ 11 : రెండు మెట్లు ఎక్కాలన్నా.. కింద కూర్చొని పైకి లేవాలన్నా.. చివరికి మెల్లగా నడవాలన్నా ప్రాణం పోయినంత నొప్పి.. కేవలం మోకాళ్ల నొప్పులే కాదు.. శరీరంలో ఉన్న అన్ని కీళ్లు నలుపుతూ ఉంటాయి. దీన్ని పాత కాలంలో కీళ్ల నొప్పులుగా చెప్పగా.. వైద్యశాస్త్రంలో ఆర్థరైటిస్ అంటారు. చలికాలమైతే అర్థరైటిస్ వ్యాధి మనిషిని సాంతం లొంగదీసుకుంటుంది. కదలడం, మెదలడం కూడా కష్టమే. సకాలంలో వైద్యం అందకపోతే శాశ్వతంగా రోగంతో అల్లాడాల్సిందేనని వైద్యులు చెబుతున్నారు. అప్రమత్తంగా ఉండి తగిన ఆహారం తీసుంటూ వ్యాయమం చేస్తే ఆపరేషన్ దాకా పరిస్థితి వెళ్లదు. అర్థరైటిస్పై అవగాహన పెంచడాని కి ఏటా ఆక్టోబర్ 12న ప్రపంచ అర్థరైటిస్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
వైద్యశాస్త్రం ప్రకారం దాదాపు వంద రకాల కీళ్ల నొప్పులు ఉన్నాయి. అందరికీ ఈ నొప్పులు ఒకేలా ఉండవు. కొందిరికి నొప్పి లే కుండా కూడా కీళ్ల వ్యాధులు ఉండొచ్చు. వయస్సు పెరిగే కొద్ది నొప్పులు అధికమవుతాయి. కొందరికి మోకాళ్లలో వాపువస్తుంది. దీంతో అసలు కదలలేరు. కీళ్ల మార్పిడీ శస్త్ర చికిత్స అందుబాటులోకి వచ్చినా అధిక వ్యయం కారణంగా అందరూ ఆపరేషన్ చేయించలేకపోతున్నారు. ప్రతి నలుగురిలో ఒకరి కి కీళ్ల నొప్పులు ఉంటున్నాయి. అస్ట్రియా అర్థరైటిస్, రుమటైడ్ ఆర్థరైటిస్. ఎక్కువగా వచ్చే కీళ్ల నొ ప్పులు ఈ రెండు వ్యాధులు కూడా రోగ నిరోధక శక్తికి అవరోధంగా ఉం టాయి. కీళ్ల నొప్పులను తొలి దశలోనే గుర్తించాలి. వ్యాధిని గుర్తించడానికి వైద్యులు పలుమార్లు ఎక్స్‌రేలను తీయాల్సి ఉంటుంది. రెగ్యులర్ మెడికల్ చెకప్‌లో భాగంగా కీళ్ల పరీక్షలు కూడా చేయించుకోవాలి.
5-15 ఏండ్ల బాలబాలికల్లో కూడా పలు రకాల కీళ్ల సమస్యలు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా జారైనల్ రుమటైడ్ ఆర్థరైటిస్, రుమాటిక్ సమస్యలు చిన్నారులను వేధిస్తుంటాయి. రుమాటిక్ ఫీవర్‌లో కీళ్ల నొప్పులు, గొంతు నొప్పి, జ్వరం వచ్చి సరైన సమయంలో చికిత్స పొందకపోతే గుండె సమస్యకు దారి తీయొ చ్చు. జునైనల్ రుమాటైడ్ ఆర్థరైటిస్‌తో బాధపడే చిన్నారుల్లో అన్నిభాగాల్లో నొప్పి ఉంటూ, జ్వరం వస్తుంది. ఆకలి తగ్గుతుంది.
ఎముకలు గట్టి పడడానికి కాల్షియంతోపాటు విటమిన్-డీ కూడా కావాలి. సూర్యరశ్మిలో విటమిన్-డీ ఉంటుంది. రోజంతా నాలుగు గోడల మధ్య, ఏసీ గదుల మధ్య ఉండటం వల్ల సూర్యరశ్మి సోకకపోవడంతో విటమిన్-డీ లోపం కలుగుతుంది. రోజూ కాసేపైనా సూ ర్యకాంతితో ఉండాలి. చదువుకునే పిల్లలు రోజంతా తగరతి గదిలో పాఠాలు వింటూ ఇంటికి వచ్చాక హోమ్‌వర్క్ చేసుకుంటూ నీడపట్టున ఉంటారు. దీనివల్ల వారికి ఎండ సోకదు. మిటమిన్-డీ సమస్య వల్ల చిన్న వయస్సులోనే ఎముకలు గుల్లబారుతాయి. ఎముకల పట్టుత్వం ఎంత తగ్గిందో తెలుసుకొని మందులు వాడాలి.
మహిళల శరీర నిర్మాణంలో ప్రత్యేకత వారి దైనందిన పనితీరు, రుతుక్రమం సరిగా లేకపోవడం, థైరాయిడ్ సమస్యల వల్ల హోర్మోన్లు తగ్గడం ఇలా.. అనేక కారణాల వల్ల ఎముకలు గుల్లబారుతాయి. కొందరు నాజూకుగా ఉండాలని తిండి తగ్గిస్తారు. అందువల్ల పోషకాలు అందవు. లేదా జింక్ ఫుడ్స్ తినండం వల్ల కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి. అన్నీ కలిసి ఎముకల సమస్యలకు దారితీస్తాయి.
వయస్సుతోపాటు ఎముకలు పెరుగుతుంటా యి. మార్పులు చెందుతుంటా యి. పాత ఎముకలు పోయి కొత్త ఎముకలు ఏర్పడతాయి. 30ఏండ్ల వ యస్సు వచ్చేసరికి ఎముకలు దళసరిగా ఎక్కువ సంఖ్యలో విస్తరిస్తాయి. ఎముకలు తిరిగి ఏర్పడుతున్న సమయంలో కాల్షియం అవసరం.
బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరస్ ఇన్ఫెక్షన్, జీవక్రియ లోపం వల్ల శరీరంలో రసాయనాల అనుమతుల్యత, హార్మోన్స్ అసమతుల్యత, థైరాయిడ్, సోరియాసిస్‌తో వ చ్చే నొప్పులు, శరీరంలోని రోగ నిరోధకశక్తి తగ్గడం వల్ల కీళ్ల నొప్పులు వస్తాయి. అధిక బరువు, ప్రమాదాలు, ఎక్కువ సేపు కూర్చోవడం, నిలబడడం, ఆహార విధానంలో మార్పుల వల్ల కీళ్ల నొప్పుల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
కీళ్ల వ్యాధులకు మొదటి దశలో కొద్దిపాటి జాగ్రత్తలు, రెండో దశలో ఫిజియోథెరిపీ, మందులు సరిపోతాయి. కీళ్ల జాయింట్లు అరిగిపోయినప్పుడు కీళ్ల మార్పిడి చేసుకోవాలి. 30ఏండ్ల వరకు ఎటువంటి సమస్య తలెత్తదు. ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవాలి. ఈత, సైక్లింగ్ చేయాలి.
– డాక్టర్ కేజే రెడ్డి, ప్రముఖ కీళ్ల మార్పిడీ శస్త్రచికిత్స నిపుణుడు, ఎస్వీఎస్ దవాఖాన, మహబూబ్‌నగర్