నాగర్ కర్నూల్ : తిమ్మాజిపేట మండల ఎస్సై ఏసీబీకి పట్టుబడ్డారు. ఒక కేసుకు సంబంధించి ఈనెల 7 తేదీన ఒక వ్యక్తి నుంచి రూ. 30 వేలు లంచం ( Bribe ) ఎస్సై డిమాండ్ చేశాడు. ఈ మేరకు సోమవారం 20 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా సోమవారం మహబూబ్ నగర్ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ( ACB DSP Balakrishna) ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ వివరాలు వెల్లడించారు.
ఇసుక సరఫరా చేస్తున్న ఓ వ్యక్తికి సంబంధించిన ట్రాక్టర్, జేసీబీని పట్టుకొని ఈనెల 5న ఎస్సై హరి ప్రసాద్ రెడ్డి( SI Hari Prasad Reddy ) కేసు నమోదు చేసి వివరాలను నాగర్ కర్నూల్ జిల్లా మైనింగ్ అధికారులకు తెలిపారు. మైనింగ్ అధికారులు ఆ వాహనాలకు రూ. 60 వేలు ఫైన్ వేశారు. ఈ డబ్బులను ఈనెల 7వ తేదీన చెల్లించి వాహనాల రిలీజ్ కోసం పత్రాలను తెచ్చి ఎస్సైకి అందజేశాడు.
అయితే ఎస్సై రూ. 30 వేలు ఇస్తేనే వాహనాలను విడుదల చేస్తామని డిమాండ్ చేశారు. మైనింగ్ ఫైన్ కట్టడంతో పాటు, మళ్లీ రూ. 30 వేలు కట్టవలసి రావడంతో వాయిస్ రికార్డింగ్లు, రూ. 20వేలు చెల్లించిన అంశాలతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అన్ని ఆధారాలతో ఏసీబీ అధికారులు సోమవారం పోలీస్ స్టేషన్కు చేరుకొని ఎస్సైని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ బాలకృష్ణ వెల్లడించారు.