నవాబ్‌పేట, డిసెంబర్ 21 : పేగు బంధం చావును కూడా లెక్కచేయదని ఓ తల్లి మృతిని చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడిన తన పిల్లలను కాపాడేందుకు వెళ్లి తానూ మృత్యుఒడిలోకి చేరుకున్న ఘటన నవాబ్‌పేట మండలం పోమాల్‌లో చోటుచేసుకున్నది. మహబూబ్‌నగర్ రూరల్ సీఐ గాంధీనాయక్, ఎస్సై విక్రమ్ కథనం ప్రకారం.. పోమాలకు చెందిన కుక్కింద సరోజ(28)కు నలుగురు సంతానం. వారిని తీసుకొని శనివారం ఉదయం పోమాల్ చెరువు వద్ద బట్టలు ఉతికేందుకు వెళ్లింది. చెరువు వద్ద సరోజ బట్టలు ఉతుకుతుండగా ఆమె కుమారుడు అక్షయ్కుమా ర్(5) ఈత కొడుతూ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి పోతుండగా గమనించిన తల్లి కుమారు డిని కాపాడేందుకు నీటిలోకి దిగింది. ఆమె కూడా నీటిలో మునిగిపోతుండడంతో రెండో కూతురు దివ్య(6) కూడా నీటిలోకి దిగిం ది.
ముగ్గురు నీటిలో మునిగిపోవడంతో పెద్ద కూతురు తేజశ్రీ సైతం వారి కోసం నీటిలోకి వెళ్తుండగా అటుగా వెళ్తున్న గ్రామస్తుడు గమనించి బయటకు తీసుకొచ్చాడు. చెరువులో మునిగిన వారి గురించి తేజశ్రీ గ్రామస్తులకు చెప్పడంతో బయటకు తీసి చూడగా, అప్పటికే తల్లీ, ఇద్దరు పిల్లలు మృతిచెందారు. చెరువు గట్టున ఉన్న చిన్న కుమారుడు శివతేజ, పెద్ద కూతురు తేజశ్రీ ప్రాణాలతో బయటపడ్డారు. మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు, గ్రామస్తుల రోధనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. విష యం తెలుసుకున్న రూరల్ సీఐ గాంధీనాయక్, ఎస్సై విక్రమ్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కాగా, ఇదే చెరువులో ఆరేండ్ల కిందట గ్రామానికి చెందిన మహిళ బట్టలు ఉతికేందుకు వెళ్లి తన ఇద్దరు పిల్లలను కాపాడబోయి మృతిచెందినట్లు తెలిపారు. సరోజ భర్త మల్లేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విక్రమ్ తెలిపారు.