మహబూబ్‌నగర్ కలెక్టరేట్, జనవరి 25 : పాలమూరు యూనివర్సిటీలో మూడురోజుల న్యాక్ టీం పర్యటన శనివారంతో ముగిసింది. ఈటీం పీయూ క్యాంపస్‌తోపాటు యూనివర్సిటీ పీజీ కళాశాల, ఫార్మసీ కాలేజ్, కాలేజ్ఆఫ్ ఎడ్యుకేషన్‌తో పాటు పీయూ పరిధిలో ఉన్న వనపర్తి, కొల్లాపూర్, గద్వాల పీజీ సెంటర్లలో పర్యటించింది. ఈ సందర్భంగా పీయూ ల్రైబ్రరీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఎగ్జిట్ మీటింగ్‌లో న్యాక్ చైర్మన్ రమాశంకర్ దుబే మాట్లాడుతూ వర్సిటీలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉందన్నారు.
అనంతరం విద్యార్థులతో ముఖాముఖి ఏర్పాటు చేశారు. కమిటీ మూడురోజుల పర్యటన వివరాలను రిపోర్టు రూపంలో సిద్ధం చేసి వైస్‌చాన్స్‌లర్, రిజిస్ట్రార్‌కు అందజేశారు. అనంతరం పీయూ వైస్‌చాన్స్‌లర్ శ్రీనివాస్ మాట్లాడుతూ వచ్చే ఐదేండ్లలో తెలంగాణలో పాలమూరు వర్సిటీని అగ్రగామిగా నిలుపుతామని, మంచి గ్రేడ్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అనంతరం రిజిస్ట్రార్ ఆచార్య చెన్నప్ప మాట్లాడుతూ న్యాక్ కమిటీ తేదీలు ప్రకటించిన తర్వాత తక్కువ సమయంలోఅన్ని ఏర్పాట్లు చేసిన బోధన, బోధనేతర సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా హాస్టళ్లలో ఉన్న సిబ్బంది సంక్రాంతి సెలవులను కూడా త్యాగం చేసి పనిచేశారని కితాబు ఇచ్చారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఆశుతోష్కుమార్, అన్నస్వామి నారాయణమూర్తి, అగర్వాల్, మలైదాసు, జయశ్రీ, పీయూ పీఆర్వో రవికుమార్, ప్రిన్సిపాళ్లు, వివిధ విభాగాధిపతులు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.