వనపర్తి టౌన్, జనవరి 24 : సైబర్ నేరాల ప్రధాన సూత్రధారి, కరుడుకట్టిన సైబర్ నేరగాడు వర్త్యావత్ రమేశ్‌నాయక్ అలియాస్ లడ్డూ రమేశ్‌ను అదుపులోకి తీసుకొని రూ.80లక్షల ఆస్తులు, కియా కారును జప్తు చేసినట్లు సైబర్ క్రైం డీఎస్పీ రత్నం, సీఐ కృష్ణ తెలిపారు. గత మూడు, నాలుగేండ్ల నుంచి రెండు రాష్ర్టాలకు సంబంధించిన అమాయక ప్రజలను ఇండియా బుల్స్, ధని, ముద్ర లోన్స్ పేరు మీద సైబర్ నేరాల ద్వారా దోచుకుంటున్న సైబర్ నేరస్తులను ఎస్పీ రావుల గిరిధర్ ఆదేశాల మేరకు జిల్లా సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ రత్నం, వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ఇప్పటి వరకు 29మంది సైబర్ నేరస్తులను అరెస్ట్ చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే.
శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైబర్ క్రైం డీఎస్పీ రత్నం, సీఐ కృష్ణ సైబర్ క్రైం కేసుల వివరాలను వెల్లడించారు. ఈ నెల 20న మధ్యాహ్నం అలకుంట రాముడు వీపనగండ్ల మండలం పుల్గర్‌చర్ల గ్రామానికి చెందిన డీజే వెంకటేశ్‌కు సైబర్ నేరస్తుడు రమేశ్, బీహర్ రాష్ర్టానికి చెందిన ఇతర సైబర్ నేరస్తుల సహకారంతో ఫోన్ చేసి మీకు రూ.2లక్షల లోన్ మంజూరయ్యిందని చెప్పారు. అందుకు గాను మీరు ముందుగానే ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని వారికి గూగుల్ పే ద్వారా డాక్యుమెంటరీ చార్జీల పేరిట విడుతల వారీగా సుమారు రూ.33,993 ఆన్లైన్లో పంపించాడు.
చివరికి లోన్ రాకపోవడంతోపాటు మోసపోయాయని గుర్తించిన వెంకటేశ్ 1930 కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు సైబర్ నేరాల ప్రధాన సూత్రదారుడు, కరుడు గట్టిన సైబర్ నేరగాడు వర్త్యావత్ రమేశ్‌నాయక్ అలియాస్ లడ్డూ రమేశ్‌ని పెద్దమందడి మండలం బలిజపల్లి గ్రామం సేవాలాల్తండాలో పట్టుకున్నట్లు చెప్పారు. నిందితుడు రమేశ్ పెద్దమందడి మండలంలోని తండాలు, మహబూబ్‌నగర్ జిల్లాలోని తండాలు వివిధ గ్రామాలకు చెందిన అనేక మంది యువకులను సైబర్ నేరాలు చేసేందుకు ఢిల్లీ, కోల్కత్తా, పాట్నాలకు పిలిపించి వారికి శిక్షణ ఇప్పించేవాడు.
రోహిత్ అలియాస్ రాజుబాయ్, పవన్, జి.రాజు అలియాస్ రాజు భల్లం, శివకుమార్ అలియాస్ శంకర్జీ, పంకజ్, అంకిత్ సహకారంతో సైబర్ నేరాలు చేయించి వారు వసూలు చేసిన డబ్బులలో వారి వాటా కింద 30 శాతం ఇప్పించి బీహార్ రాష్ర్టానికి చెందిన వారి ద్వారా కమిషన్ డబ్బులు తీసుకునేవాడు. ఆ విధంగా నిందితుడు ఇప్పటివరకు సుమారు రూ.కోటి కంటే ఎక్కువగానే సంపాదించాడు. ఈ క్రమంలో నేరస్తుడికి సహకరించిన అతని అన్న చంద్రశేఖర్, తన అమ్మ గోపమ్మని కూడా ఈ నేరంలో నేరస్తులుగా చేర్చినట్లు వారు వెల్లడించారు.
నిందితుడు సైబర్ నేరాల ద్వారా సంపాదించిన డబ్బులతో తన తండాలో సుమారు రూ.45లక్షలు ఖర్చుపెట్టి ఒక ఇల్లు కట్టుకున్నాడని, వనపర్తి పట్టణంలో సూర్యచంద్రస్కూల్ సమీపంలో రూ.24లక్షల విలువగల రెండు ప్లాట్లను కొనుగోలు చేశాడు. అదేవిధంగా రూ.12లక్షల50వేల విలువ గల కియా కారును, ఒక మొబైల్ ఫోన్‌ను కొనుగోలు చేసి మిగిలిన డబ్బులను తన జల్సాలకు ఖర్చుపెట్టాడని చెప్పారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టు హాజరుపర్చడంతోపాటు నిందితుడి కారు, మొబైల్ ఫోన్, స్థిరాస్తి పత్రాలు జప్తు చేసి కోర్టులో సమర్పించినట్లు చెప్పారు. ఈ కేసు ఛేధించిన జిల్లా సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ రత్నం, డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ కృష్ణ, బ్యూరో ఎస్సై రవిప్రకాశ్, వీపనగండ్ల ఎస్సై రాణితోపాటు పలువురు పోలీసు సిబ్బందిని ఎస్పీ రావుల గిరిధర్ అభినందించారు.