మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ, అక్టోబర్ 14 : విద్యుత్ శాఖలో బదిలీల పరంపర కొనసాగుతున్నది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 166 మందికి పండుగపూట బదిలీలు కాగా.. సోమవారం ఏడీ, ఏఈ, డీఈలకు స్థానచలనం జరిగింది. ఇందులో కొందరికి పదోన్నతులు వరించాయి. మహబూబ్‌నగర్ సర్కిల్ పరిధిలో ఏఈగా పనిచేస్తున్న జగన్మోహన్కు ఏడీగా పదోన్నతితోపాటు అచ్చంపేటకు బదిలీ అయ్యారు. ఎంఆర్టీ ఏఈగా పనిచేస్తున్న రవీంద్రమోహన్కు ఏడీగా పదోన్నతి రాగా వనపర్తికి ట్రాన్స్ఫర్ అయ్యారు.
ఐసీఎస్ఈ ఏఈగా సర్కిల్లో పనిచేస్తున్న మాధవికి ఏడీగా పదోన్నతి రాగా.. నాగర్‌కర్నూల్ జిల్లా కన్స్‌స్ట్రక్షన్ ఏడీగా పోస్టింగ్ ఇచ్చారు. జోగుళాంబ గద్వాల ఏడీ నాగరాజు డీఈగా పదోన్నతిపై మహబూబ్‌నగర్‌కు వెళ్లారు. డీఈ భాషా మెదక్ జిల్లాకు బదిలీ కాగా ఆయన స్థానంలో వనపర్తి నుంచి రాచప్ప మహబూబ్‌నగర్‌కు వచ్చారు. జడ్చర్ల డీఈ కృష్ణమూర్తి కందుకూరు రాజేంద్రనగర్ సర్కిల్‌కు.., డీఈ సుబ్బారావు హబ్సిగూడకు బదిలీ అయ్యారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం ఏడుగురు ఏడీలు, 23 మంది ఏఈలు, 5 మంది డీఈలకు స్థాన చలనం కలిగింది.
బదిలీలు పూర్తి పారదర్శకంగా చేపట్టామని చెబుతున్నా.. కొన్ని సంఘాల బాధ్యులకే ఎక్కువగా అనుకూలమైన స్థానాలు కేటాయించారని ఎస్సీ, ఎస్టీ విద్యుత్ ఉద్యోగ సంఘాల నాయకులు ఎస్ఈ పీవీ రమేశ్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. వివిధ కేటగిరీల్లో నిబంధనలకు అనుగుణంగా చేపట్టాల్సిన బదిలీల్లో అనుకూలంగా ఉన్నవారికే పోస్టింగ్‌లు ఇవ్వడంతో అర్హులు, వితంతువులకు అన్యాయం జరిగిందన్నారు. ఏడేండ్లకు పైగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారిని పట్టణ ప్రాంతాలకు తీసుకొచ్చే అవకాశం ఉన్నా అలా చేయడలేదని ఆరోపించారు. ఈ విషయంలో నిబంధనలకు లోబడి చర్యలు తీసుకోకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.