గోపాల్పేట, డిసెంబర్ 31 : బోధనాభ్యాసన ప్రక్రియలో ఉపాధ్యాయులు, విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు విద్యాశాఖ రూపొందిస్తున్న ఎఫ్ఎల్ఎన్, తొలిమెట్టు కార్యక్రమం అభినందనీయమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. పాఠశాల స్థాయిలో కాకుండా ఇంటర్, డిగ్రీ స్థాయిలో ప్రవేశపెట్టాలన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉమ్మడి మండల పాఠశాలల విద్యార్థులకు ఏర్పాటు చేసిన ‘తొలిమెట్టు-బోధనాభ్యసన సామగ్రి, టీచింగ్ టెర్నింగ్ మెటీరియల్ మేళాకు మంత్రి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు సాధించాల్సిన లక్ష్యంపై ఆత్మవిశ్వాసంతో ఉండాలన్నారు. అధ్యాపకులు నిరంతరం అధ్యయనం చేయాలని, విద్యార్థులకు విషయం నేరుగా అర్థమయ్యేలా తెలియజేయాలన్నారు. ఎప్పటికప్పుడు టీచింగ్, లర్నింగ్ టెక్నిక్లను అందిపుచ్చుకోవాలని సూచించారు. అవకాశాలను అందిపుచ్చుకొని కసి, పట్టుదలతో అడుగులు వేయాలన్నారు. ప్రతి పదివేల మంది సగటులో 44 మంది వైద్యులు ఉండాలని కోరారు. అనంతరం విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. ప్రతిభ చూపిన వారికి నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ అడ్డాకుల సంధ్య, జెడ్పీటీసీ మంద భార్గవి, సెక్టోరియల్ అధికారి యుగేంధర్, ఎంఈవో శ్రీనివాస్‌గౌడ్, నోడల్ అధికారులు రమాకాంత్, కేశవులు, హెచ్ఎంలు మధుసూదన్, రాజశేఖర్‌రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.