నవాబ్‌పేట, ఏప్రిల్ 13: అధికారంలో ఉన్న నా సొంత ఊరులోనే తాగునీటి గోస తీరడం లేదు.. ఇక వేరే గ్రామాల సంగతి దేవుడెరుగు.. అధికారులు స్పందించరు, ప్రజాప్రతినిధులు పట్టించుకోరు అంటూ కాంగ్రెస్ పార్టీ నవాబ్‌పేట మండలాధ్యక్షుడు నీరటి రాంచంద్రయ్య తన సొంత గ్రామం రు క్కంపల్లిలో ఆదివా రం గ్రామస్తులతో కలిసి ధ ర్నా చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.
రుక్కంపల్లిలో రెండుమూడు నెలల నుంచి తరచూ తాగునీటి ఎద్ద డి నెలకొంటున్నది. క రెంటు కోతలు, నీటి స రఫరాలో అంతరాయాల కారణంగా గ్రామాన్ని గతకొంత కాలం నుంచి తాగునీటి ఎద్దడి వేధిస్తోంది. ఈ విషయమై గంతలోనే ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో రుక్కంపల్లిలో నీటి ఎద్దడి శీర్షికన కథనం కూడా ప్రచురితమైంది. ఇటీవల నీటి ఎద్దడి అధికం కావడంతో కాంగ్రెస్‌పార్టీ మండలాధ్యక్షుడు రాంచంద్రయ్య గ్రామస్తులతో కలిసి ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో, ధర్నా నిర్వహించారు.
సుమారుగా రెండుగంటలపాటు రాస్తారోకో నిర్వహించడం తో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రాస్తారోకో చూసిన వారంతా.. మీ ప్రభుత్వమే ఉంది కదా.. ఎందుకు ధర్నా చేస్తున్నావని అడిగితే.. నా ఊర్లోనే సమస్య తీరడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి రాంచంద్రయ్యతో ఫోన్లో మాట్లాడి ధర్నా విరమించాలని, సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రుక్కంపల్లిలో ఆదివారం సాయంత్రం వరకు కూడా నీటి సమస్య పరిష్కారం కానట్లు తెలిసింది.