గద్వాల, మార్చి 31 : జిల్లా ప్రభుత్వ దవాఖాన రికార్డుల్లో అప్‌గ్రేడ్ తప్పా వసతుల్లో కనిపించడం లేదు. ఆపరేషన్లు చేసేందుకు వైద్యులు ఉన్నా అందుకు అవసరమైన పరికరాలు అరకొరగా ఉండడంతో రోగులకు అవస్థలు తప్పడం లేదు. గతంలో సర్కారు దవాఖాన అంటే నేను రాను బిడ్డో అనే నానుడి ప్రస్తుతం జిల్లా దవాఖానలో నెల కొన్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో ఏరియా దవాఖానగా ఉన్నదానిని స్థాయి పెంచి జిల్లా దవాఖానగా మార్చి అందుకు అవసరమైన సౌకర్యాలు జిల్లా దవాఖానలో కల్పించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జిల్లా దవాఖానకు వచ్చే రోగులకు కష్టాలు మొదలయ్యాయి. పేరుకు మాత్రమే జిల్లా దవాఖాన సౌకర్యాలు మాత్రం శూన్యం అనే చందంగా ఉండిపోయింది. జిల్లా ఏర్పాటుతో జిల్లా దవాఖానలో ప్రతి రోజూ ఓపీ 500నుంచి 600 వరకు ఉంది. అయి తే అందుకు తగ్గట్టుగా సిబ్బంది లేకపోవడంతో రోగులకు వైద్యం గాలిలో దీపంగా మారింది. జిల్లా దవాఖానలో పనిచేసే కొందరు వైద్యులు ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రైవేట్ క్లినిక్‌లు పెట్టుకొని దందా కొనసాగిస్తున్నా వైద్యశాఖ అధికారులు పట్టించుకోవ డం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దవాఖానపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రోగులకు సరైన వై ద్యం అందడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ త ఇరవై రోజులకు ము ందు అయిజ మండ లం మేడికొండకు చె ందిన మీనాక్షి రెం డో కాన్పు నిమి త్తం గద్వాలలోని జిల్లా దవాఖానకు తీసుకొచ్చారు.అయితే గర్భిణికి చికిత్స అందిండచంలో అక్కడి వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యం వహించడంతో నవజాత శిశువు మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. కలెక్టర్ అకస్మికంగా దవాఖానను తనిఖీ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కలెక్టర్ మీనాక్షికి సంబంధించి కే-షీట్ ఇవ్వాలని బాధితులను అడగగా వారు తమకు ఇక్కడి వైద్యులు కే-షీట్ ఇవ్వలేదని చెప్పడంతో దవాఖాన అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలా రోగులపై దవాఖాన వైద్యులతో పాటు సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తుండడంతో రోగులు జిల్లా దవాఖానకు రావాలంటే జంకుతున్నారు.
రోగుల వస్తువులకు భద్రత కరువు..
ఓ వైపు రోగులు తమ రోగాలను నయం చేసుకోవడానికి దవాఖానకు వస్తే వారి వెంట తెచ్చుకున్న వస్తువులకు భద్రత లేకుండా పోయింది. రోగుల వెంట వచ్చిన వారి బంధువులు దవాఖాన ఖర్చుల నిమిత్తం డబ్బులు ఇతర వస్తువులు తెచ్చుకుంటే వాటిని అక్కడ పనిచేసే సిబ్బంది అపహారిస్తూ రోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్‌కు చెందిన మహిళ ఫిబ్రవరి 27వ తేదీన గద్వాల జిల్లా కేంద్రంలోని దవాఖానకు వచ్చింది.
ఆమె తన బ్యాగ్‌లో రూ.14లక్షల నగదుతోపాటు రెండు తులాల బంగారు ఆభరణాలు తెచ్చుకుందని ఆమె కుటుంబసభ్యులు నారాయణపేట జిల్లాలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలు గద్వాల జిల్లా కేంద్రంలోని దవాఖానలో తన వెంట తెచ్చుకున్న బ్యాగ్ అక్కడే వదిలేసి వెళ్లింది. అది గమనించిన దవాఖానలో పనిచేసే వ్యక్తి బ్యాగును అపహరించినట్లు సీసీ పుటేజ్ ఆధారంగా గుర్తించారు. అతనిని అదుపులోకి తీసుకొని గద్వాల పట్టణ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇలాంటి ఘటన గతంలోను జరిగింది. దీంతో రోగులతో పాటు వారి బంధువులు విలువైన వస్తువులు వెంట తెచ్చుకోవాలంటే భయపడుతున్నారు.
పేషెంట్లను స్ట్రెచర్స్పై బంధువులే తీసుకెళ్తూ..
దవాఖానకు వచ్చిన రోగులు నడవలేని స్థితిలో ఉంటే వార్డు బాయ్‌లు, లేక సిబ్బంది వారిని చికిత్స అందించే వార్డుల వద్దకు తీసుకెళ్లాలి కానీ జిల్లా దవాఖానలో అలా జరగడం లేదు. రోగి బంధువులే కుర్చీపై వార్డు వద్దకు తీసుకెళ్తున్నారు. ఈ విషయం అక్కడి వైద్యాధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. దీంతో రోగుల బంధువులు ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. రోగుల వెంట వచ్చే బంధువులకు సరైన సౌకర్యాలు దవాఖానలో కల్పించక పోవడంతో వారు దవాఖాన ఆరుబయటే భోజనాలు చేస్తున్నారు. అనంతరం అక్కడే సేద తీరుతున్నారు. రోగుల వెంట వచ్చే వారి బంధువులకు టాయిలెట్స్ లేకపోవడంతో దవాఖాన ఆవరణలో మల మూత్ర విసర్జన చేసి పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్నారు.
రోగులకు సబంధించి బట్టలను కూడా ఆరుబయటే ఉతుకుతున్నారు. దవాఖానలో సరైన మందులు రోగులకు అందించక పోవడంతో వారు దవాఖాన ఆవరణలో ఉన్న మెడికల్ షాపునకు వెళ్లి మం దులు కొని తెచ్చుకుంటున్నారు.దవాఖానలో టాయిలెట్స్ ఉన్న వాటికి అక్కడి సిబ్బంది తాళం వేయడంతో రోగులు ఒకటికి, రెంటికి ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు. ఈ విషయం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా టాయిలెట్స్ తెరిచి ఉంచాలని ఆదేశించినప్పటికీ వాటిని తెరవడం లేదు. అక్కడి సిబ్బంది కలెక్టర్ ఆదేశాలను ఖాతర్ చేయడం లేదు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి దవాఖానలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు రోగులపై నిర్లక్ష్యం వహించకుండా వారికి మెరుగైన వై ద్య సేవలు అందేలా చూడాలని రోగులతో పాటు వారి బంధువులు కోరుతున్నారు.