ఊట్కూర్, ఆగస్టు 17 : కర్ణాటక సరిహద్దు పట్టణాల నుంచి మక్తల్ నియోజకవర్గంలోకి జరుగుతున్న గంజాయి సరఫరా విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నది. మక్తల్ పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాలు, కృష్ణ, మాగనూర్, ఊట్కూర్ మండల కేంద్రం, పరిసర గ్రామాల్లో గంజాయి విక్రయాలు చాపకింద నీరులా కొనసాగుతున్నప్పటికీ అధికారులు, పోలీసుల హెచ్చరికలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కర్ణాటకలోని గుర్మిట్కల్, యాద్గీర్ కేంద్రాలుగా ఆయా మండలాలకు గంజాయి విక్రయాలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగిస్తున్నారు. ఇప్పటి వరకు పట్టణాలకే పరిమితమైన గంజాయి పరఫరా ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు పాకడంతో గంజాయి మత్తులో విద్యార్థులు, యువత తూలుతున్నారు. మరో పక్క దినసరి కూలీలు, కాలేజీ స్టూడెంట్లనే టార్టెట్గా పెట్టుకుని గంజాయి అమ్మకాలు చేపడుతున్నారు. విద్యార్థులు, యువత గంజాయి మత్తుకు బానిసవుతుండటం తల్లిదండ్రులను ఆందోళనకు గురిస్తోంది.
పోలీసుల అదుపులో నిందితులు..
మక్తల్, ఊట్కూర్ మండలాల్లో టాస్క్ఫోర్క్ పోలీసులు దాడులు నిర్వహించి పలువురు గంజాయి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈక్రమంలోనే ఈనెల 15న ఊట్కూర్ మండలకేంద్రం నుంచి మక్తల్ వైపు వెళ్లే ప్రధాన రహదారి పక్కన అయ్యప్పస్వామి టెంపుల్ సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు యువకులను టాస్క్ఫోర్స్ పోలీసులు విచారించి వారి వద్ద నుంచి 125 గ్రాముల గంజాయి పాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
అరవింద్ కర్ణాటక రాష్ట్రం గుర్మిట్కల్ తాలూకాకు చెందిన కోరేబాన్ సంజీవ్గా గుర్తించి రిమాండ్కు తరలించామని ఎస్సై రమేశ్ తెలిపారు. గంజాయి విక్రయాలు చేపడితే ఎంతటి వారైనా సహించేది లేదని, చట్టపరమైన శిక్షలు తప్పవని ఆయన హెచ్చరించారు. విద్యార్థులు చెడు అలవాట్లకు బానిస కాకుండా క్రమ శిక్షణతో చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచనలు చేశారు. గంజాయి విక్రయాలు జరిపితే తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
మద్యం దాబాలే విక్రయ కేంద్రాలుగా..
గ్రామాల్లో మద్యం దాబాల వద్ద గంజాయి బ్యాచ్ మద్యంతోపాటు గంజాయి తాగి హల్చల్ చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. నిందితులలో ఒకరైన చెట్టుకింద అరవింద్ గ్రామంలో ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. కొన్నాళ్లుగా కర్ణాటక నుంచి గుట్టు చప్పడు చాకుండా గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నాడు. గ్రామంలోని ప్రభుత్వ దవాఖాన సమీపంలోని ఓ మద్యం దాబాతోపాటు మరి కొన్ని గ్రామాల్లో దాబాల వద్ద గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నట్లు సమాచారం.