నడిగడ్డలో కాంగ్రెస్ కోటకు బీటలుపడ్డాయి. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ చెక్ పెట్టింది. 1952 నుంచి నియోజకవర్గంలో 16 సార్లు ఎన్నికలు జరగగా.. గద్వాల కోటపై కాంగ్రెస్ జెండా ఏడుసార్లు ఎగిరింది. 40 ఏండ్లు పాలించిన డీకే కుటుంబ పాలనకు ఫుల్స్టాప్ పెడుతూ కృష్ణమోహన్‌రెడ్డి గెలుపుతో 2018 లో బీఆర్ఎస్కు అడ్డాగా మారింది. సీఎం కేసీఆర్ సహకారంతో ఎమ్మెల్యే బండ్ల అభివృద్ధిని పరుగులు పెట్టించగా.. సంక్షేమ సౌరభాలు పూయించారు. 70 ఏండ్లపాటు కుంటుబడిన ప్రగతిని కేవలం నాలుగున్నరేండ్లలోనే రూ.1,233 కోట్లతో చేసి నియోజకవర్గ రూపురేఖలనే మార్చేశారు. నెట్టెంపాడ్ లిఫ్ట్‌తో 1.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుండగా గట్టు ఎత్తిపోతల పూర్తయితే మరో 33 వేల ఎకరాలు సాగులోకి రానున్నాయి. సాగునీటి రాకతో ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారింది. దీంతో ఓటర్లు మళ్లీ బీఆర్ఎస్కే జై కొట్టనున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
గద్వాల, అక్టోబర్ 31 : గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా గద్వాల నియోజకవర్గం విద్యా, వైద్యపరంగా వెనుకబడిపోయింది. కృష్ణమోహన్‌రెడ్డి గెలిచిన తర్వాత విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగారు. ఐదేండ్ల కాలంలోనే 60ఏండ్ల అభివృద్ధిని సీఎం కేసీఆర్ సహకారంతో చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని నెరవేర్చడంతోపాటు ఎన్నికల్లో ఇవ్వని హామీలను సైతం నెరవేర్చారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా గోసపడ్డ నడిగడ్డ ప్రస్తుతం అభివృద్ధివైపు అడుగులు వేస్తున్నది.
గద్వాల నియోజకరవ్గం ఏర్పడిన తర్వాత 1952లో మొదటిసారి సాధరణ ఎన్నికల నాటి నుంచి 2014 వరకు 8మంది 16సార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అందులో డీకే కుటుంబం 40 ఏండ్లపాటు ఎమ్మెల్యేలుగా పాలన సాగించారు. జిల్లా ఏర్పాటైన తర్వాత 2018లో మొదటిసారి గద్వాల కోటపై గులాబీ జెండాను బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఎగురవేసి కుటుంబ పాలనకు స్వస్తి చెప్పారు. 2018లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి డీకే అరుణను కృష్ణమోహన్‌రెడ్డి 28,445 ఓట్ల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించారు. 2018లో సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి ముందు 15ఏండ్లు అధికార దర్పం అనుభవించిన ఈ ప్రాంత మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ తన మేనల్లుడు కృష్ణమోహన్‌రెడ్డి చేతిలో చిత్తయ్యారు. అరుణకు 2009, 2104లో వచ్చిన మొత్తం మెజార్టీ కంటే కృష్ణమోహన్‌రెడ్డికి వచ్చిన మెజార్టీ 28,445తో తుడిచి పెట్టుకపోయింది. 2016 సంవత్సరానికి ముందు గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలు కలిపి 9మండలాలతో రెవెన్యూ డివిజన్‌గా ఉండేది. జిల్లాల ఏర్పాటు సమయంలో తొమ్మిదిగా ఉన్న మండలాలను గద్వాల, అలంపూర్‌ను కలిపి మొత్తం 12 మండలాలతో జోగులాంబ గద్వాల జిల్లాగా ఏర్పాటు చేశారు. అలంపూర్ నియోజకవర్గంలోని ఉండవెల్లి, రాజోళి, గద్వాల నియోజకవర్గంలోని కేటీదొడ్డిని ప్రభుత్వం కొత్త మండలాలుగా ఏర్పాటు చేసింది. దీనికితోడు ప్రభుత్వం ఎర్రవల్లి చౌరస్తాను కొత్త మండలంగా ప్రకటించడంతో ప్రస్తుతం జోగులాంబ గద్వాల జిల్లా 13 మండలాలతో రూపుదిద్దుకున్నది. 2104లో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్ర భుత్వం అధికారంలోకి రాగా, ఇక్కడ మాత్రం కాంగ్రెస్ అభ్యర్థికి పట్టం కట్టారు. కృష్ణమోహన్‌రెడ్డికి పదవి లేకున్నా ప్రభుత్వ సహకారంతో సుమారు రూ.126కోట్లు నిధులు తె చ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథం వైపు తీసుకెళ్లారు. అవే విజయానికి నాంది పలికాయి.
ఈ నాలుగున్నరేండ్లలో గద్వాల వైద్యరంగంలో ఎంతో ప్రగతి సాధించింది. గతంలో చిన్న, చిన్న ప్రమాదాలకు కర్నూల్ లేదా హైదరాబాద్‌కు తరలించే వారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. దవాఖానలో 100 పడకలు ఉండగా, రూ.49.16లక్షలతో 300పడకలుగా పెంచి ఆధునిక హంగులతో దవాఖాన నిర్మిస్తున్నారు. నర్సింగ్ కళాశాల మంజూరు చేయించి ఈ ప్రాంత విద్యార్థులు నర్సింగ్ విద్యను అభ్యసించే అవకాశం కల్పించారు. మెడికల్ కళాశాల మంజూరుకు కృషి చేశారు. భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ప్రతి గ్రామంలో ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పల్లె దవాఖానలు ఏర్పాటు చేయించారు. జిల్లా దవాఖానలో రోగుల సౌకర్యార్థం ఉచిత రోగ నిర్ధారణ పరీక్షల కోసం తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేసి 133 రకాల పరీక్షలు చేస్తున్నారు. ఐసీయూ, డయాలసిస్, ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణం, సెంట్రల్ మెడికల్ స్టోర్, రేడియాలజీ విభాగం ఏర్పాటు చేశారు.
గతంలో ఈ ప్రాంతం సాగునీటిపరంగా వెనుకబడిపోయింది. ప్రస్తుతం నెట్టెంపాడ్ ఎత్తిపోతల పథకం ద్వారా 1.30లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. గట్టు ఎత్తిపోతల పథకం అందుబాటులోకి వస్తే మరో 33వేల ఎకరాలు సాగులోకి వచ్చే అవకకాశం ఉంది. గద్వాల నియోజకరవ్గంలో రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి రైతు వేదికలు ఏర్పాటు చేశారు. కరువుతో బాధపడుతన్న గట్టు ప్రజలకు గట్టు ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించారు. దీంతో 33వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉన్నది.