యాసంగిలో సాగుచేసిన వరి పంటలు కోతకొచ్చాయి. నూర్పిడి పనుల్లో అన్నదాతలు బిజీగా ఉండగా కొనుగోలు చేయాల్సిన అధికారులు మాత్రం సంసిద్ధత చూ పడం లేదు. కొనుగోలు కేంద్రాల ఏ ర్పాటు కేవలం ప్రకటనకే పరిమితం కావడంతో రైతులు అయోమయంలో పడ్డారు. కేంద్రాల్లో సరిపడా గన్నీ బ్యాగులు లేకపోవడంతో అప్పుడొస్తాయ్.. ఇప్పుడొస్తాయ్ అంటూ అధికారులు కాలం వెల్లదీస్తున్నారు. అంత అవసరమైతే మిల్లుల నుంచి బస్తాలు తెచ్చుకోవాలని రైతులకు ఉచిత సలహాలిస్తున్నారు. గన్నీ బ్యాగుల కొరతతో కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి.
బీఆర్ఎస్ సర్కారు హయాంలో కేంద్రం మోకాలడ్డుతున్నా.. ధాన్యం కొనుగోలు విషయంలో సీఎం కేసీఆర్ వెనుకడుగు వేయలేదు. గత యాసంగిలో రైతులు సాగుచేసిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకున్నా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసింది. పంట కోతకొచ్చే సమయానికి ముందే ధాన్యం కొనుగోళ్లకు అధికారులు ఏర్పాట్లు చేసేవారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, గన్నీ బ్యాగులు సమకూర్చడం, ధాన్యం నిల్వ గోదాంలు వంటి అంశాలపై ప్రత్యేక కార్యాచరణ ఉండేది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఐకేపీ, మండల మహిళా సమాఖ్యలు, మెప్మా, వ్యవసాయ మార్కెట్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేసేవారు.
గత ప్రభుత్వం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను యూనిట్‌గా తీసుకొని ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యాన్ని వేగంగా కొనుగోలు చేసేవారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో 220, మహబూబ్‌నగర్ జిల్లాలో 192, జోగుళాంబ గద్వాల జిల్లాలో 74, వనపర్తి జిల్లాలో 250 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి దాదాపు 10లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు.
ధాన్యం దిగుబడి ప్రారంభమై దాదాపు 20 రోజులు కావస్తుంది. ఇప్పటి వరకు గన్నీ బ్యాగుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. యాసంగిలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు వీలైనంత త్వరగా పంటను అమ్ముకునేందుకు సంసిద్ధమయ్యారు. కొనుగోలు కేంద్రా ల్లో ఏ గ్రేడ్ రకానికి క్వింటాకు ధర రూ.2,260, బీ గ్రేడ్‌కు రూ.2,240 చెల్లిస్తున్నారు. కానీ, గన్నీ బ్యాగుల కొరతతో రైతులు ప్రైవేట్ వ్యా పారులను ఆశ్రయించడంతో ఇదే అదునుగా భావించి నిలువుదోపిడీ చేస్తున్నారు. తరుగు, తేమ పేరుతో క్విం టాకు 5 నుంచి 6 కిలోల వరకు కోత పెడుతున్నారు. ధర కూడా రూ.1,800 నుంచి రూ.2వేల వరకు మాత్రమే నిర్ణయిస్తున్నారు. ఇదేంటని అడిగితే ఇష్టం ఉంటే అమ్మండి లేకుంటే వెళ్లండి అంటూ దురుసుగా మాట్లాడుతున్నారని రైతుల ఆవేదన వ్యక్తం చేసున్నారు.
గతేడాది యాసంగితో పోల్చితే ఈసారి ధాన్యం దిగుబడి గణనీయంగా తగ్గినట్లు తెలుస్తున్నది. సకాలంలో వర్షాలు కురువకపోవడంతో నవంబర్ నాటి కే ప్రాజెక్టుల నుంచి సాగునీరు నిలిచిపోయాయి. గతేడాది దిగుబడితో పోలిస్తే ఈసారి 60 శాతానికి మించకపోవచ్చని అధికారుల అంచనా. కాగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రూ. 500 బోనస్‌తో కలిపి ధాన్యం కొనుగోలు చేస్తే బాగుంటుందని అన్నదాతలు కోరుతున్నారు. కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్‌ను నమ్మి నట్టేట మునిగామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కల్వకుర్తి పీఏసీసీఎస్ పరిధిలో 24 కేంద్రాలను ప్రారంభించాం. కానీ గన్నీ బ్యాగులు ఉంటేనే కొనుగోలు సాధ్యమవుతుంది. అధికారులను అడిగితే వస్తా యి అంటున్నారు తప్పా ఎప్పుడొస్తాయో చెప్పడం లేదు. రైస్ మిల్లుల వద్ద తీసుకోండని అధికారులు ఉచిత సలహాలిస్తున్నారు. పోనీ వాళ్ల వద్దే తీసుకుందామన్నా అవి చినిగిపోయాయి. రైతులు ప్రతి రోజూ ఫోన్ చేసి ధాన్యాన్ని ఎప్పుడు కొనుగోలు చేస్తారని అడుగుతున్నారు. వారికి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు.