కల్వకుర్తి, జనవరి 7 : రైతులకు కాసులు కురిపించే తెల్ల బంగారం(పత్తి) సాగు చేసే రైతన్నలకు సీసీఐ నిబంధనలు గుడిబండగా మారింది. తుఫాన్ వర్షాల వల్ల ఆశించిన దిగుబడి రాక కష్టాల్లో ఉన్న పత్తి రైతులకు.. సీసీఐ నిబంధనలు బంధనాలుగా మారాయి. మద్దతు ధర దేవుడెరుగు కనీసం పత్తిని కొనుగోలు చేస్తేచాలని రైతు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీఐ కొనుగో లు కేంద్రాలు ఏర్పాటు చేసిన తొలిదశలో తేమ పేరుతో ఇబ్బందులకు గురిచేసిన అధికారులు.. ఇప్పుడేమో పత్తి నాణ్యతగా లేదని పత్తి కొనుగోలుకు నిరాకరిస్తున్నారు.
కాళ్లు వేళ్లు పట్టుకుని బతిమిలాడితే.. కనిష్ఠ ధర నిర్ణయించి కొనుగోళ్లు చేస్తున్నారు. సీసీఐ తీరుపై రైతులు తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో రైతు సంఘాల నాయకులు మండిపడుతున్నారు. సీసీఐ పత్తి గరిష్ఠ ధర రూ.8,110 సీసీఐ పత్తిని క్వింటాకు రూ.8,110 గరిష్ఠ ధరకు కొనుగోలు చేయాలనే నిబంధనలు ఉన్నాయి. అత్యంత దురదృష్టం ఏమిటంటే… ఇంత వరకు గరిష్ఠ ధరకు కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. రూ.7,600 నుంచి 7,900 వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏమి చెబుతున్నారంటే.. పత్తి నాణ్యతగా లేదట.
కల్వకుర్తి మండలం తాండ్రకు చెందిన రైతు..
కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామానికి చెందిన రాజేశ్(పేరుమార్చాం) చచ్చి చెడి కపాస్ కిసాన్ మాప్లో పత్తిని విక్రయించేందుకు స్లాట్ బుక్ చేసుకున్నాడు. బుక్ చేసుకున్న రోజు నుంచి సరి గ్గా 10 రోజులకు స్లాట్ బుక్కయింది. (పాపం స్లాట్ బుక్ చేసుకునేందుకు చాలా రోజులు కష్టపడ్డాడు. అది వేరే విషయం). స్లాట్ బుక్ అయి న రోజున ఎంపిక చేసుకున్న సీసీఐ కేంద్రం ఉన్న జిన్నింగ్ మిల్లు వద్దకు తాను పండించిన పత్తిని విక్రయించేందుకు ట్రాక్టర్‌తో తీసుకుపోయాడు. సీసీఐ అధికారిని కలిసి స్లాట్ బుక్ చేసుకున్న రసీదును చూపించాడు. సదరు అధికారి ట్రాక్టర్ వద్దకు వచ్చి రైతు తీసుకువచ్చిన పత్తిని పరిశీలించాడు. పెదవి విరిచాడు. అతను హిందీలో ఏదో చెబుతున్నాడు. రైతుకు ఏమి అర్థం కావడం లే దు. చివరకు ఓ పెద్ద మనిషి సిపారసుతో రైతుకు చెందిన పత్తిని సీసీఐ అధికారులు క్వింటాకు రూ.7,630 ధర నిర్ణయించి కొనుగోలు చేశారు. జీవితంలో పత్తి పండించవద్దు.. ఈ కష్టాలు పడవద్దని సదరు రైతు తోటి రైతుల వద్ద వాపోయాడు. ఈ పరిస్థితి దాదాపు ప్రతి సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద ఉంది.
వర్షాలు కురుస్తున్నప్పుడు..
పత్తిని తీసే సమయంలో తుఫాన్ వర్షాలు వచ్చాయి. అప్పుడు పత్తిని కొనుగోలు చేయడానికి పత్తిలో తేమ శాతం ఎక్కువగా ఉందని సీసీఐ అధికారులు నిరాకరించారు. ఇప్పుడేమో వర్షాల వల్ల పత్తి నాణ్యత తగ్గిందని కొనుగోలు చేయడానికి మొండి కేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం క్షేత్ర స్థాయిలో పరిస్థితి తెలుసుకోకుండా.. పూర్తి స్థాయిలో పత్తిని కొనుగోలు చేస్తున్నామని ప్రకటనలు చేస్తున్నది.
జిన్నింగ్ మిల్లుల వద్ద హైడ్రామా..
సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఉన్న జిన్నింగ్ మి ల్లుల వద్ద హైడ్రామా కొనసాగుతుంది. స్లాట్ బుక్ చేసుకుని రైతును పత్తిని విక్రయించడానికి సీసీఐ కొనుగోలు కేంద్రం ఉన్న జిన్నింగ్ వద్దకు వెళ్లి సీసీఐ అధికారిని కలుస్తాడు. సదరు అధికారి సహజంగానే పత్తి నాణ్యతగా లేదు. కొనుగోలు చేయలేమని అంటాడు. అప్పడు సదరు రైతుకు ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు పత్తిని ఏం చేయాలి.. ఎక్కడ అమ్మాలి.. ఎక్కడికి తీసుకుపోవాలి అని అందోళనలో ఉంటాడు. అప్పుడు వస్తారు బ్రోకర్ రాజాలు. పత్తి నాణ్యత తక్కువగా ఉంది. ఇక్కడ ఉన్న మిల్లు వాళ్లకు అమ్మితే బాగుంటుందని ఉచిత సలహా ఇస్తాడు. వెంటనే అక్కడే తచ్చాడుతున్న మిల్లుకు సంబంధించిన వారు ఇంతకు కొనుగోలు చేస్తామని చెబుతారు. అప్పటికే విసిగి వేసారిన రైతు మిల్లువారు అడిగిన ధరకు విక్రయించాల్సిన పరిస్థితి వస్తుంది.
రైతుల ఆందోళనలు..
సీసీఐ పత్తి కొనుగోలు చేపట్టిన నాటి నుంచి ప్రతి రోజూ ఏదో ఒక చోట రైతులు ఆందోళనలు చే స్తూనే ఉన్నారు. సీసీఐ అధికారులు తేమ ఉంది లేదా నాణ్యతగా లేదని పత్తినికొనుగోలు చేయ డం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉ న్నారు. ఈ విషమమై ప్రభుత్వంలో ఏ ఒక్కరూ కూడా నేరుగా స్పందించలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు తక్కువ ధరకు పత్తి బోకర్లకు అమ్ముకుంటున్నారు. గత రెండు రోజుల కిందట చారకొండ మండల కేంద్ర సమీపంలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం వద్ద రైతులు భారీస్థాయిలో ధర్నా, రాస్తారోకో చేశారు.
సీసీఐ అధికారులు బోకర్లకు చెందిన పత్తిని కొనుగొలు చేస్తున్నారు.. రైతుల పత్తిని కొనుగోలు చేయడం లేదని నినాదాలు చేశారు. తాము తీసుకువచ్చిన పత్తిని తిరస్కరించి, బ్రోకర్లు తీసుకువచ్చిన పత్తిని మాత్రం కొనుగోలు చేస్తున్నారని.. ఇం దులో భారీ కుట్ర దాగి ఉందని రైతు లు మండిపడ్డారు. బ్రోకర్లు, సీసీఐ అధికారు లు ముమ్మక్కైయ్యారని ఆరోపించారు. సీసీఐ కొనుగోలు చేయకుంటే ఏదో ధరకు తాము బ్రోకర్లకు పత్తి అమ్ముకుంటే.. అదే పత్తిని బ్రోకర్లు సీసీఐ కేంద్రానికి అమ్ముకుంటారని.. ఇందులో అమ్యామ్యాల మతలబు ఉందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభు త్వం పత్తి రైతుల సమస్యలను అసలు పట్టించుకోవడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.