అయిజ, డిసెంబర్ 21 : కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్ట అడుగంటుతున్నది. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో పూర్తిగా నిలిచిపోవడంతో ఆనకట్టలో నీటి మట్టం క్రమేపీ తగ్గుతున్నది. ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్‌ఫ్లో నిలిచిపోగా గురువారం ఆర్డీఎస్ ప్రధానకాల్వకు నీటి విడుదలను నిలిపివేశారు. ప్రస్తుతం ఆనకట్టలో 3.7అడుగుల మేరనీటి ని ల్వ ఉన్నట్లు ఆర్డీఎస్ ఏఈ రాందాస్ తెలిపారు. తుమ్మిళ్ల పథకం పంప్ ద్వారా నీటి విడుదల కొనసాగుతుందని పేర్కొన్నారు.
కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం నీటి నిల్వ 10.894 టీఎంసీలకు చేరుకున్నది. టీబీ డ్యాంకు ఇన్‌ఫ్లో నిలిచిపోగా, అవుట్‌ఫ్లో 640 క్యూసెక్కులు ఉన్నది. 105.788 టీఎంసీల పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం కలిగిన డ్యాంలో ప్రస్తుతం 10.894 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. 1,633 అడుగుల గరిష్ఠ నీటి మట్టానికి గానూ ప్రస్తుతం 1,589.84 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు డ్యాం సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు.