వనపర్తి, మే 11 (నమస్తే తెలంగాణ): యాసంగి వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ రైస్ మిల్లర్ల కొర్రీలతో వెనక్కి.. ముందుకు సాగుతుంది. గతంలో ఎప్పు డూ లేనంతగా యాసంగిలో ధాన్యం విక్రయాలు రైతులకు ముచ్చెమటలను పట్టిస్తున్నాయి. చూస్తుండగానే కొనుగోళ్ల ప్రక్రియ నెలరోజులకు ఇంచుమిం చు చేరింది. ఇలాగే సాగితే మరోనెల గడిచినా ఈ ప్ర క్రియ ముగిసేలా లేదు. వెరసి అకాల వర్షాలతోపా టు మరో పక్షం రోజులు గడిస్తే.. వేసవి ముగిసి తొలి వ్యవసాయ పనుల్లోకి వెళ్లేందుకు అన్నదాతలు సిద్ధం కావాల్సి ఉంది. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా కొనుగోళ్లు రెండు అడుగులు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లు సాగుతుండడం మరిన్ని సమస్యలకు దారితీస్తుంది.
జిల్లాలో యాసంగి వడ్లు పండిన సంతోషం రైతులకు ఏమాత్రం మిగలడం లేదు. ‘అమ్మబోతే అ డవి.. కొనబోతే కొరివి’ అన్నట్లు పాత సామెతను అన్నదాతలు గుర్తు చేసుకుంటున్నారు. పండించిన ధాన్యం అమ్ముకోవాలంటే.. ధర్నాలు చేయాల్సి వస్తుంది. పదేళ్లుగా నడుస్తున్న వ్యవస్థను కాదని కొత్త పద్ధతులను అధికారులు చేపడతామంటే రైతాంగం ససేమిరా అంటుంది. జిల్లాలో 371 సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఒక రోజు పని జరిగితే.. మరో రెండు రోజులు పని బంద్ అన్నట్లుగా ప్రక్రియ సాగుతుంది. నెలరోజులుగా చిన్నంబావి మండలం వెలుగొండలో ధాన్యం కొనుగోలు చేపట్టక పోవడంతో రైతులు రోడ్డెక్కి ధర్నాకు దిగారు. దీ న్ని బట్టి జిల్లాలో కొనుగోళ్ల ప్రక్రియ ఎలా సాగుతుం దో అర్థమవుతుంది.
తాలు పేరుతో దోపిడీ
వరి కొనుగోళ్లలో ప్రధానంగా తాలు సమస్యను మిల్లర్లు లేవనెత్తుతున్నారు. ఇప్పటికే 40 కేజీల ధాన్యం బస్తాకు 41.200 కేజీల తూకం వేస్తున్నారు. సంచి తూకం కేవలం 300నుంచి 400 గ్రాముల్లోపే ఉంటుంది. ఇదిపోనూ మరో 800 గ్రాములు ప్రతి 40 కేజీల బస్తాకు అదనంగా ఉంటుంది. అక్కడికి సరిపోదని మిల్లర్లు ఇంకో కేజీ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. వడ్లతో లారీ వెళితే.. అక్కడ సతాయిస్తున్నారు. సంచులు దింపుకోమని వడ్లలో తాలు ఉం దని, మట్టి పెడ్డలు ఉన్నాయంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. జిల్లాలోని ఒకటి రెండు మినహా మెజార్టీ మిల్లుల్లో ఇదే తరహా దోపిడీకి తెరలేపారు. వడ్ల సంచుల లోడ్‌తో వెళ్లిన లారీని రెండు, మూడురోజులు నిలిపి బేరం పెట్టి పది, ఇరవై క్వింటాళ్ల మోతాదులో ఒక్కొక్క లారీకి తరుగు పేరుతో మిల్లర్లు అందినకాడికి దండుకుంటున్నారు.
డీలా పడిన కొనుగోళ్లు
జిల్లాలో యాసంగి కొనుగోళ్ల ప్రక్రియ డీలా పడింది. ఇందుకు కారణాలనేకం ఉన్నాయి. మిల్ల ర్లు, హమాలీలు, గన్నీ బ్యాగులు, గోడౌన్లు, ట్రాన్స్‌పోర్టు లాంటివన్ని కొనుగోళ్ల చుట్టూ తిరుగుతున్నా యి. ఇవన్నీ సవ్యంగా ఉంటేనే తూకాలు సాఫీగా జరుగుతాయి. సెంటర్లలో వేలాది బస్తాలు తూకాల కు సిద్ధంగా ఉంటే, ఒకటి, రెండు లారీల వడ్లు కొనుగోలు చేసి నిలిపివేస్తున్నారు. వెళ్లిన లారీల సంచులు దించకపోవడంతో సమస్య మొదటికి వస్తున్నది. మరికొన్ని చోట్ల తూకం వేసిన బస్తాలను ఎత్తకపోవ డం వంటివి ఉన్నాయి.
ధాన్యం తరలింపు టెండర్లు తీసుకున్న కాంట్రాక్టర్లు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెలువడుతున్నాయి. మొదటి కాంట్రాక్టర్ మళ్లీ ఓ రైస్‌మిల్ యజమానికి సబ్ కాంట్రాక్ట్ అప్పగించడంతో ధాన్యం సరఫరాలో అనేక లొసుగులు జరుగుతున్నట్లు తెలుస్తుంది. నా మిల్లు, నా లారీలు, నా ఇష్టం అన్నట్లుగా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో జిల్లాలో కొనుగోళ్ల ప్రక్రియ పూర్తిగా డీలా పడి ఎప్పటికి పూర్తవుతుందో తెలియని అగమ్యగోచరాన్ని తలపిస్తుంది.
వర్షాలొస్తే తడవాల్సిందే..
అకాల వర్షాలతో అతలాకుతలమవుతున్న రైతులు ధాన్యం అమ్ముకునేందుకు వర్షాకాలం వస్తుందేమో అన్న సందేహాలను వెల్లడిస్తున్నారు. మే నెల ముగిస్తే.. జూన్‌లో వర్షాలు రావడం సాధార ణం. సెంటర్లలో రైతులకు ఎలాంటి వసతులు లే కుండా నరకం చూపిస్తున్న నిర్వాహకులు ఏకంగా కొనుగోళ్ల ప్రక్రియను నత్తనడకన సాగిస్తున్నారు. జిల్లాలో భారీ ఎత్తున పండిన ధాన్యాన్ని మిల్లర్లు, కొందరు అధికారులు అందినకాడికి కాజేయాలన్న ఉద్దేశంతోనే కొనుగోళ్లను డీలా చేస్తున్నారన్న విమర్శలు వెలువడుతున్నాయి.
డీలా చేయడంతో రైతు లు తూకాలను పెద్దగా పట్టించుకోరని, తరుగు పేరు తో మరిన్ని క్వింటాళ్లు తీసుకునేందుకు వీలవుతుందన్న ఎత్తులతోనే డీలా పడగొట్టారని చెబుతున్నారు. సెంటర్లలో కనీసం రైతులకు ఒక్క కవర్ కూడా ఇవ్వడం లేదు. వర్షాలకు రైతులే సొంతంగా కవర్లను ఏర్పాటు చేసుకున్నారు. వర్షాల సీజన్ వచ్చే నాటికైనా కొనుగోళ్లను పూర్తి చేస్తారా లేదా అన్న అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు.
ఈ ఫొటోలో చూస్తున్న రైతు పేరు వెంకట్‌రెడ్డి. ఇతని ఊరు దొడగుంటపల్లి, పెద్దమందడి మండలం. 25రోజుల కిందట వరి చేను కోసి 14 ట్రాక్టర్ల వడ్లను సెంటర్‌కు తెచ్చిండు. ఈ రోజు..రేపంటూ కాలం గడుస్తుంది తప్పా.. వడ్లు తూకాలు కావడం లేదు. సమస్య ఏంటో.. ఎక్కడుందో ఆ రైతుకు మాత్రం అర్థం కావడం లేదు. పొద్దస్తమానం వడ్లు తూకం వేస్తారని ఎదురు చూడటం.. రాత్రయితే కాపలా కాసుకోవడం రైతు వంతైంది. ఇలా రెంటికి చెడ్డ రేవడిలా రైతు పరిస్థితి కొనుగోలు కేంద్రాల్లో కొట్టుమిట్టాడుతున్నది. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తగిన న్యాయం జరుగుతుందన్న నమ్మకం కూడా రైతులకు కనిపించడం లేదు. ఇలా ఈ ఒక్క రాములయ్యే కాదు.. జిల్లాలోని 371 సెంటర్లలో ఎందరో రాములయ్యలు కొనుగోలులో ఇబ్బందులు పడుతున్నారు.
గన్నీబ్యాగుల కొరతతో పడిగాపులు
నవాబ్‌పేట, మే 11: మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ఉత్సవ విగ్రహంలా కన్పిస్తోం ది. అక్కడ గన్నీ బ్యాగుల కోసం అన్నదాతలు ప్రతినిత్యం కేంద్రానికి రావడం.. వెనుదిరిగి పోవడం పరిపాటిగా మా రింది. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఎనిమిది రోజుల కిందట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రారంభం రోజున 5వేల గన్నీ బ్యాగులు వస్తే ఒకటే రోజు రైతులు బ్యాగులు తీసుకెళ్లి ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చారు. ఇక అప్పటి నుంచి గన్నీ బ్యాగులు రాలేవు.
నవాబ్‌పేట, దాయపంతులపల్లి, యన్మన్గండ్ల, రుక్కంపల్లి తదితర గ్రామాల రైతులు ఈ కేంద్రంలోనే ధాన్యం విక్రయించాల్సి ఉంది. గన్నీ బ్యాగులు రాకపోవడం తో రైతులు ధాన్యాన్ని కల్లాలు, పొలాల్లోనే కుప్పలుగా పోసి బ్యాగుల కోసం వస్తే కేం ద్రం నిర్వహించే మహిళా సంఘం సభ్యులు బస్తాలు రాలేవని చె ప్పడంతో ఎంతో నిరాశతో వెనుదిరిగిపోతున్నారు. అలాగే లింగంపల్లి, కొల్లూరు, చౌడూర్‌లో కొనుగోలు చేసిన ధా న్యం లిఫ్ట్ చేయకపోవడంతో ధాన్యం కేంద్రాల్లోనే పేరుకుపోయింది.
ధాన్యం లిఫ్ట్ చేసేందుకు లారీలు రాకపోవడంతో కొనుగోలు చేసిన ధాన్యం ఇక్కడే ఉంటుందని కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. ఇతర డీసీఎంలు, ట్రాక్టర్లలో తీసుకెళ్తే తమకు మిల్లర్ల వద్ద సమస్యలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఏపీఎం జీవరత్నంను వివరణ కోరగా.. నవాబ్‌పేట కేంద్రానికి వచ్చిన 5వేల బ్యాగులు రైతులకు ఇచ్చేశామని, త్వరలోనే బ్యాగులు తెప్పిస్తామన్నారు. లారీల కొరత విషయమై రెండు రోజుల కిందట అదనపు కలెక్టర్ మో హన్రావుకు వివరించామని చెప్పారు. కొన్ని గ్రా మాలకు లారీలు వచ్చాయని, మరికొన్ని గ్రామాలకు త్వరలోనే పంపిస్తామని చెప్పారు.