అధినేత రాకతో పాలమూరు పులకించింది. గులాబీ బాస్, సీఎం కేసీఆర్కు నీరాజనం పలికారు. ప్రజల ఆశీర్వాదం కోసం వచ్చిన జననేతకు బ్రహ్మరథం పట్టారు. జై తెలంగాణ.. జైజై కేసీఆర్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బాలుర కళాశాల మైదానంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ జనహోరును తలపించింది.
ఎండను సైతం లెక్కచేయకుండా ప్రజలు భారీగా తరలిరావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. బీఆర్ఎస్ అభిమానులు, నేతలు, కార్యకర్తలు వేలాదిగా తరలిరావడంతో సభా ప్రాంగణంతోపాటు రోడ్లన్నీ కిటకిటలాడాయి. మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం నిర్వహించినప్పటికీ.. మధ్యాహ్నం 12 గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. దీంతో పాలమూరు పట్టణమంతా జనసంద్రమైంది.