జడ్చర్లటౌన్, డిసెంబర్18 : మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని నమ్మి ప్రజలు బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ కంటే ఎక్కువ సీట్లు బీఆర్ఎస్ గెలిచిందన్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్, వార్డు సభ్యులను గురువారం జడ్చర్లలో మాజీ మంత్రి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో గ్రామాలకు నిధులు ఇవ్వలేదని.. గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తిగా ఆగిపోయాయని చెప్పారు.
బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి పనులను కొనసాగించటంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందన్నారు. కేసీఆర్ గ్రామాలను పచ్చగా మారిస్తే.. కాంగ్రెస్ హయాంలో గ్రామాలు వెలవెలబోతున్నాయని చెప్పారు. కేసీఆర్ హయంలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు గానూ కేంద్ర సంస్థల అవార్డులు తెలంగాణకు వచ్చాయని గుర్తు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏ మేరకు వ్యతిరేకత ఉందో తెలుస్తున్నదని చెప్పారు. సాధారణంగా ఏ పార్టీ అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు అనుకూలంగా ఉంటాయి.. అయినప్పటికీ బీఆర్ఎస్ విజయం సాధించిందన్నారు. రాష్ట్రంలో నలభై శాతం సర్పంచ్ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుందని చెప్పారు.
మొదటి విడుత పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కొట్టిన దెబ్బకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గ్రామ గ్రామాన తిరిగి ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఏకంగా సీఎం ప్రచారం చేసినా ప్రజలు పట్టించుకోలేదని పంచాయతీ ఎన్నికల్లో అధిక స్థానాల్లో బీఆర్ఎస్ సర్పంచులను గెలిపించారన్నారు. కాంగ్రెస్ పార్టీ పోలీస్ పవర్, విచ్చలవిడిగా డబ్బులు పంచినా ప్రజలు బీఆర్ఎస్ పార్టీని గెలిపించి కాంగ్రెస్‌కి తగిన బుద్ధి చెప్పారన్నారు. కాంగ్రెస్ వైఫల్యానికి ప్రజలు తీర్పును సైతం కాంగ్రెస్ నాయకులు రకరకాలుగా మాట్లాడుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు గెలిచిన చోట నిధులు ఆపుతామని పలుచోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ సర్పంచ్‌లను ప్రలోభాలకు గురిచేస్తూ పార్టీలోకి రావాలని ఒత్తిడిళ్లు తీసుకొస్తున్నా.. ఎవరూ పార్టీ మారటం లేదని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్ అభ్యర్థులను తమ ఖాతాలోకి వేసుకొని కాంగ్రెస్ గెలిచిందని చెప్పుకుంటున్నారని విమర్శించారు. జడ్చర్ల నియోజకవర్గంలో గెలిచిన స్వతంత్ర అభ్యర్థులకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌లోకి ఇతర పార్టీల నాయకులను రానివ్వను అని చెప్పిన ఎమ్మెల్యే ఇప్పుడేమో ఎవరోస్తరా అని ఎదురుచూస్తున్నాడని ఎద్దేవా చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో బీఆర్ఎస్ పార్టీ మరింత పుంజుకుందని చెప్పారు. రాబోయే ప్రతి ఎన్నికలోనూ బీఆర్ఎస్ పార్టీ విజయం తథ్యమన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పిట్టల మురళి, రఘుపతిరెడ్డి, శ్రీశైలంయాదవ్, మాజీ జెడ్పీటీసీ జయప్రద, శ్రీకాంత్, ఇంతియాజ్‌తోపాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు.