పాలమూరులో ప్రధాని మోదీ పర్యటన ఆంక్షల మధ్య సాగింది. అమిస్తాపూర్ వద్ద సభా వేదికగా రూ.13,500 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసినా ఉమ్మడి జిల్లాకు మాత్రం మొండిచేయి చూపారనిప్రజలు అసహనం వ్యక్తం చేశారు. పాలమూరుకు జాతీయ హోదా మాటే ఎత్తలేదని ఉసూరుమన్నారు. సభకు జనాదరణ కరువై చాలా వరకు ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి.
అయిజ, అక్టోబర్ 1 : అక్టోబర్ 2 అనగానే సాధారణంగా అందరికీ గుర్తుకొచ్చేది మహాత్మాగాంధీ జయంతి.. కానీ ఇదే రోజున నడిగడ్డ ప్రజలకు వణుకు పుట్టింది. ఆనాడు రోజుల తరబడి గ్రామాలు, పట్టణాలకు సంబంధాలు తెగిపోయి కొన్ని జీవితాలే అతలాకుతలమై మాయని గాయాన్ని మిగిల్చింది. నడిగడ్డలో వరద బీభత్సం సృష్టించి పద్నాలుగేండ్లు గడిచినా ఆ సందర్భం ఇంకా నడిగడ్డ ప్రజల కండ్లముందే కదలాడుతున్నది. ప్రకృతి ప్రకోపానికి, కృష్ణా, తుంగభద్ర ఉప్పొంగి నడిగడ్డ అతలాకుతలమైంది. తుంగభద్ర ప్రకోపానికి జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం పులికల్ సమీపంలోని నాగల్‌దిన్నె వంతెన నేలమట్టమైంది. అలంపూర్, అయిజ, వడ్డేపల్లి, మానవపాడు, గద్వాల మండలాల్లో వరద బీభత్సం సృష్టించి వేలాది మందిని నిరాశ్రయులను చేసింది.అయిజ మండలంలో తుంగభద్ర ఉధృతికి గ్రామాలు అతలాకుతలమయ్యాయి. 2009, అక్టోబర్ 2న సంభవించిన ఈ ఘటనలో వేలాదిమంది నిర్వాసితులయ్యారు. చేతికొచ్చిన పంట వేల ఎకరాల్లో నీటమునిగింది. కుటుకనూరు పూ ర్తిగా మునిగిపోగా, రాజాపురం, పులికల్, కేశవరం, వేణిసోంపురం, కిసాన్‌నగర్‌కు చెందిన భూములు కోతకు గురయ్యాయి.
తీరిన ఏటి కష్టాలు..
ఈ వంతెనను పునర్నిర్మాణం జరుగక తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ర్టాల ప్రయాణికులు నానా కష్టాలు పడ్డారు. పద్నాలుగేండ్ల పాటు పుట్టి ప్రయాణాలకు అనుమతుల్లేక అసంపూర్తిగా నిర్మించిన వంతెనపైకి నిచ్చెనల సాయంతో ఎక్కి నాగల్‌దిన్నె వరకు నడక సాగించారు. ఈక్రమంలో రాష్ట్ర సరిహద్దులో 2.09 ఎకరాల భూసేకరణకు తెలంగాణ ప్రభుత్వం రూ.18.40లక్షలు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. కలెక్టర్, అదనపు కలెక్టర్, ఆర్డీవోలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని భూసేకరణ పూర్తి చేయగా వంతెన పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం నాగల్‌దిన్నె వంతెన నిర్మాణం పూర్తి కావడంతో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.
తుంగభద్ర నదిపై వంతెన..
తెలంగాణ – ఏపీలోని రాయలసీమ జిల్లాలను అనుసంధానం చేస్తూ తెలంగాణలోని పులికల్, ఏపీలోని నాగల్‌దిన్నె గ్రామాల మధ్య తుంగభద్రా నదిపై వంతెన నిర్మాణానికి 1993లో శంకుస్థాపన చేశారు. 1992లో వరదల నేపథ్యంలో బ్రిడ్జి నిర్మాణానికి పూనుకున్నారు. 1993లో పనులు మొదలైనప్పటికీ అధికారికంగా చేపట్టింది 2003లోనే. అప్పటి నుంచి 2009 అక్టోబర్ 2 వరకు రాకపోకలు జరిగాయి. ఆరోజున నది జలప్రళయానికి నాగల్‌దిన్నె వంతెన నేల మట్టమైంది. కాగా 2012లో బ్రిడ్జి పునర్నిర్మాణానికి రూ.42కోట్లతో మళ్లీ టెండర్లు పిలిచి 2013లో పనులు ప్రారంభించారు. తెలంగాణ ఏర్పాటుతో ప్రభుత్వం భూసేకరణకు నిధులు విడుదల చేయడంతో ఈ ఏడాది ఆగస్టులో వంతెన పనులు పూర్తయ్యాయి. దీంతో తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ర్టాల ప్రయాణికులు సాఫీగా ప్రయాణాలు సాగిస్తున్నారు.
ఎమ్మెల్యే అబ్రహం ప్రత్యేక శ్రద్ధ..
2018 డిసెంబర్లో అలంపూర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన అబ్రహం నాగల్‌దిన్నె వంతెన పనులు పూర్తి చేసేందుకు చొరవ చూపారు. కర్నూల్ కలెక్టర్, ఆర్అండ్బీ అధికారులతోపాటు మంత్రులు, ఎంపీలను కలిసి వంతెన పనులు పూర్తి చేయాలని కోరారు. సీఎం కేసీఆర్‌ను ప్రత్యేకంగా కలిసి బ్రిడ్జి నిర్మాణానికి కావాల్సిన భూసేకరణకు నిధులు విడుదల చేయాలని కోరారు. రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని కలిసి వంతెన ఆవశ్యకతను వివరించారు. దీంతో తెలంగాణ, ఏపీ సీఎస్‌లు నిధుల విడుదలకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. దీంతో గద్వాల జిల్లా, అయిజ మండలం పులికల్, రాజాపూర్ గ్రామాల రైతులకు చెందిన 2.09 గుంటల భూసేకరణకు రూ.18.40 లక్షలను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో కలెక్టర్, అదనపు కలెక్టర్, ఆర్డీవో చర్యలు తీసుకుని 18 రైతులతో పలు దఫాలుగా చర్చించి భూసేకరణ పూర్తి చేశారు.