అయిజ, మే 3 : కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం క్రస్ట్‌గేట్ల ఆధునీకరణ ప్రక్రియ ముగిసింది. డ్యాంలోని మొత్తం 33క్రస్ట్‌గేట్ల ఎరక్షన్ పూర్తి చేశారు. వర్షాకాలానికి ముందే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సాగు, తాగునీటిని అందించేందుకు టీబీ డ్యాం సిద్ధమైంది. కర్ణాటక, ఏపీలోని రాయలసీమ, తెలంగాణ రాష్ర్టాల్లోని లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్న తుంగభద్ర జలాశయం మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. కీలకమైన ఈ డ్యాం భద్రతపై ఏడాదిగా నెలకొన్న ఆందోళనలకు తెరదించుతూ మొత్తం 33 క్రస్ట్‌గేట్ల ఆధునీకరణ ప్రక్రియ ఏప్రిల్ 25న ముగిసింది.
దాదాపు ఏడు దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ భారీ ఇంజినీరింగ్ అద్భుతాన్ని కాపాడుకునేందుకు 2026, ఫిబ్రవరి 16వతేదీన ప్రారంభమైన క్రస్ట్‌గేట్ల అమరిక పనులు యుద్ధప్రాతిపదికన సాగింది. రెండు నెలల వ్యవధిలోని 33 క్రస్ట్‌గేట్లు బిగించి, ఎరక్షన్ పనులు పూర్తి చేశారు. టీబీ బోర్డు కార్యదర్శి రామకృష్ణారెడ్డి నేతృత్వంలో క్రస్ట్‌గేట్ల బిగింపు పనులు పూర్తి చేశారు. 33 క్రస్ట్‌గేట్ల పనులు పూర్తి చేయడంతోపాటు ట్రయర్ రన్ నిర్వహించి నీటి విడుదలకు సిద్ధం చేశారు.
సాగు, తాగునీటికి భరోసా..
వానకాలం ముందర తుంగభద్ర జలాశయం కొత్త గేట్లతో ముస్తాబవడంతో కోట్లాది మంది తాగునీటికి, లక్షలాది ఎకరాల సాగునీటికి భరోసా వచ్చింది. కర్ణాటకలోని విజయనగర జిల్లా, హోస్పేట్ వద్ద తుంగ, భద్ర నదుల కలయికతో ఏర్పడిన జలాశయంపై 100టీఎంసీలకు పైగా నిల్వ సామర్థ్యంతో నిర్మించిన ప్రాజెక్టు దక్షిణాదిన అతిపెద్ద డ్యాంల్లో ఒకటిగా తుంగభద్ర ప్రాజెక్టు ప్రసిద్ధి పొందింది. 2024, ఆగస్టులో టీబీ డ్యాం 19వ క్రస్ట్‌గేటు చైన్ లింక్ తెగిపోవడంతో గేటు కొట్టుకుపోవడంతో డ్యాం భద్రతపై సందేహాలు తలెత్తాయి. నాటిచేదు జ్ఞాపకాన్ని తుడిచేస్తూ, అత్యాధునిక సాంకేతికతతో కూడిన చైన్లను బిగించడంతో డ్యాం ఆయుస్సు పెరిగినట్లయింది.
ఆర్డీఎస్, తుమ్మిళ్లకు తుంగభద్ర నీరే ఆధారం..
తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లా, అలంపూర్ నియోజకవర్గంలోని ఆర్డీఎస్, తుమ్మిళ్ల ప్రాజెక్టులకు తుంగభద్ర నీరే ఆధారం. 87,500ఎకరాల ఆయకట్టుకు తుంగభద్ర నది నుంచి సాగునీరు అందుతోంది. ఆర్డీఎస్ ఆయకట్టుకు 15.9టీఎంసీల నీటిని బచావత్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేసింది. ఆర్డీఎస్ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ సర్కారు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని 2018లో పూర్తి చేసి, సాగునీరు అందించింది.
వానకాలంలో తుంగభద్ర డ్యాం ద్వారా ఆర్డీఎస్, తుమ్మిళ్ల ప్రాజెక్టుల్లోని ఆయకట్టుతోపాటు తుంగభద్ర నదీతీర గ్రామాలకు తాగునీటిని ఢోకా ఉండదని అలంపూర్ నియోజకవర్గ ప్రజలు, రైతులు ఆశాభావం వ్య క్తం చేశారు. టీబీ డ్యాం క్రస్ట్‌గేట్ల బిగింపు నేపథ్యంలో యాసంగిలో ఆర్డీఎస్ ఆయకట్టుకు ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించడంతో రైతులు నష్టపోయారు. ఈ ఏడాది వానకాలంలో టీబీ డ్యాంకు వరదలు వచ్చి పంటలు సమృద్ధిగా పండాలని రైతులు ఆశతో ఎదురుచూస్తున్నారు.