మహబూబ్నగర్ కలెక్టరేట్, మార్చి 5: ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు 97.44శాతం విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. కేంద్రాల వద్ద సందడి వాతావారణం నెలకొంది. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల వద్దకు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉదయం 8గంటలకే చేరుకున్నారు. ప్రతివిద్యార్థి హాల్ టికెట్స్తోపాటు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అధికారులు అనుమతించారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మొదటి రోజు నిర్వహించిన సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1 (తెలుగు, హిందీ, సాంస్కృతి, ఆరబిక్)కు జనరల్ కేటగిరీలో 9323 మందికి 9124 మంది హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 2086 మందికిగానూ 1993 హాజరయ్యారు. కేంద్రాలను డీఐఈవో కౌసర్జహాన్, సంబంధిత అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ఈనెల 6వ తేదీ నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
జడ్చర్లటౌన్, మార్చి 5: జడ్చర్లలోని మొత్తం 5 కేంద్రాల్లో మొత్తం 1,297 మంది విద్యార్థులకు 1,256 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, 41 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల్లో ఒక్కో విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసి హాల్లోకి అనుమతించారు. అదేవిధంగా పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఆయా పరీక్ష కేంద్రాల్లో విద్యార్థుల సౌకర్యార్థం ఏర్పాట్లుగావించారు.
మిడ్జిల్, మార్చి 5: మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో బుధవారం ఇంటర్, పారామెడికల్ ఒకేషనల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రథమ సంవత్సరంలో 178 మంది విద్యార్థులకు 173 మంది హాజరైనట్లు ప్రిన్సిపాల్ తిరుపతయ్య తెలిపారు.
మహ్మదాబాద్, మార్చి 5: ఇంటర్ ప్రథమ సంవత్సరం మొదటిరోజు పరీక్షలకు 14 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు చీఫ్ సూపరింటెండెంట్ సుగ్నేశ్, గురుకుల ప్రిన్సిపాల్ రమా తెలిపారు. మండలంలో రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా.. నంచర్ల గురుకుల పాఠశాలలో 350 విద్యార్థులను కేటాయించగా 345 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మహ్మదాబాద్ జూనియర్ కళాశాలలో 229 విద్యార్థులను అలాట్ చేయగా 220 మంది హాజరయ్యారు.
నారాయణపేట రూరల్, మార్చి 5: ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు బుధవారం జిల్లాలో ప్రశాంతంగా కొనసాగాయి. జిల్లాలో మొత్తం 16 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 3,888 మంది జనరల్ విద్యార్థులను అలాట్ చేయగా 3,767 మంది హాజరయ్యారు. 121మంది విద్యార్థులు గైర్హజరయ్యారు. ఒకేషనల్ పరీక్షలకు 588 మంది విద్యార్థులను అలాట్ చేయగా 569 మంది హాజరుకాగా.. 19మంది గైర్హాజరయ్యారు. పేటలోని సాయి కళాశాల పరీక్ష కేంద్రాన్ని అదనపు కలెక్టర్ బెన్షాలం పరిశీలించారు. పేటతోపాటు పలు పరీక్ష కేంద్రాలను డీఎస్పీ లింగయ్య పరిశీలించారు. ఫ్లయింగ్ స్కాడ్ బృందం దామరగిద్ద, మద్దూరు, కోస్గి, డీఈసీ కన్వీనర్ నారాయణపేట, డీఈసీ మెంబర్లు ఊట్కూర్, మక్తల్, మాగనూర్, డిస్ట్రిక్ట్ బల్క్ ఇన్చార్జి మరికల్, ధన్వాడ సిట్టింగ్ స్కాడ్ బృందం మక్తల్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షలన్నీ ప్రశాంతంగా జరిగినట్లు డీఐఈవో సుదర్శన్రావు తెలిపారు.
మరికల్, మార్చి 5: ఇంటర్ పరీక్షలు బుధవారం మరికల్లో ప్రశాంతగా సాగాయి. మండల కేంద్రంలోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించిన కేంద్రంలో మొత్తం 257 మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు ప్రిన్సిపాల్ నాగమణిమాల తెలిపపారు.
మక్తల్, మార్చి 5: ఇంటర్ ఫస్టీయర్ పరీక్షలు తొలిరోజు మక్తల్లో ప్రశాంతంగా కొనసాగాయని పరీక్షల కస్టోడియం ఆఫీసర్ రామస్వామి తెలిపారు. మక్తల్లో మూడు కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 308 విద్యార్థులకు 301, మైనార్టీ గురుకుల కళాశాలలో 384 మందికి 376, సాలర్స్ జూనియర్ కళాశాలలో 331మందికి 318మంది హాజరయ్యారు.