మాగనూర్ : రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 12 గురుకులాల్లో ఇంటర్మీడియట్ కళాశాలలు (Intermediate Gurukuls) ఎత్తివేయాలనే నిర్ణయం తక్షణమే వెనక్కి తీసుకోవాలని భారత విద్యార్ది ఫెడరేషన్(SFI) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. నారాయణపేట ఎస్ఎఫ్ఐ జిల్లా సభ్యులు నయిమ్ ( Nayeem ) మాట్లాడుతూ రాష్ట్రంలో గురుకుల కళాశాలలు పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. కార్పొరేట్ కళాశాలలు లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న నేపథ్యంలో గురుకులాలు పేద విద్యార్థులకు ఆసరాగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
వాటిని ఎత్తివేసే ఆలోచన చేయడం పేద విద్యార్థులకు చదువును దూరం చేయడమేనని అన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థులకు ఆసరాగా ఉన్న విద్యాసంస్థలను అభివృద్ధి చేసి మరింత మందికి అడ్మిషన్లు ఇచ్చి, చదువు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గురుకులాల రద్దు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.