ధాన్యం కొనుగోలు ప్రక్రియ గాడితప్పుతున్నది. ముందు నుంచి వరి దిగుబడులు అధికంగా ఉంటాయన్న అంచనా ఉన్నప్పటికీ అందుకు తగ్గ ఏర్పాట్లు చేయడంలో అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతున్నది. ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం అందక చేతులెత్తేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. యాసంగిలో 3.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసి 371 సెంటర్లు ప్రారంభించినా ఇప్పటి వరకు కేవలం 80 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు జరిగింది. వనపర్తి జిల్లా వ్యాప్తంగా ఏ కేంద్రంలో చూసినా తూకాలు చేయక ధాన్యం రాసులే దర్శనమిస్తున్నాయి. రోజురోజుకూ ధాన్యం మరింత పెరుగు తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా సన్న వడ్లు 35 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినా క్వింటాకు కూడా బోనస్ డబ్బులు అందలేదు. జిల్లాలో రూ.17 కోట్ల బోనస్ అందాల్సి ఉండడంతో రైతులు దిగాలు చెందుతున్నారు.
– వనపర్తి, మే 6 (నమస్తే తెలంగాణ)
వనపర్తి జిల్లాలో ధాన్యం కొనుగోలు కోసం 371 కేంద్రాలను ప్రారంభించారు. మరో వందకుపైగా సెం టర్లను తెరవాల్సి ఉన్నది. యాసంగిలో 3.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందన్న అధికారులు అం చనా వేశారు. ఈ మేరకు సెంటర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఉగాది పండుగ అనంతరం వరి కోతలు మొదలయ్యాయి. ముందుగా ఆత్మకూరు, అమరచింత, మదనాపురం, కొత్తకోట మండలాల్లో కోతలు షూరు కాగా.. ఇటీవల అన్ని ప్రాంతాల్లోనూ జోరందుకున్నా యి. ఇప్పటివరకు జిల్లాలో 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన అంచనా ఉన్నది. అయితే పది రోజులకుపైగా జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తుండడంతో ధాన్యం తడిసి నష్టపోతామోనని దిగాలు చెందుతున్నారు.
సన్న వడ్లకు బోనస్ లేదు
నెల రోజులనుంచి జిల్లాలో వడ్ల కొనుగోలు ప్రక్రి య కొనసాగుతున్నది. ముందుగా కొనుగోలు చేసిన సన్నవడ్ల రైతులకు కూడా ఇప్పటి వరకు బోనస్ డబ్బులు పడిన దాఖలాలు లేవు. క్వింటా సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తున్నది. ఇప్పటి వరకు సన్నరకం వడ్లు దాదాపు 35 వేల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలు చేసినట్లు అంచనా. వీటిలో ఒక్క క్వింటా కు కూడా బోనస్ డబ్బులు పడకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. ఈ లెక్కన జిల్లాలో రూ.17 కోట్ల బోనస్ రైతులకు అందాల్సి ఉంది. ఇప్పుడప్పుడంటూ ఊరించడమే తప్పా బోనస్ పడడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. కొనుగోలు చేసి నెల రోజులైనా బోనస్ బోణీ కావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
రూ.వంద కోట్ల బకాయిలు
సన్నవడ్ల బోనస్ ఇంకా బోనీ కాని పక్షంలో ఇక అసలు డబ్బులు కూడా పెండింగ్లోనే ఉన్నాయి. మొత్తం ఇప్పటి వరకు 80వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు అంచనా ఉంటే.. రూ86కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో పడ్డాయి. కొనుగోలు చేసిన మొత్తం వడ్లకు రూ.170 కోట్లకు పైగా రావాల్సి ఉంది. అయితే, ఇందు లో సగం అటు.. ఇటు అన్నట్లుగానే రైతులకు డబ్బులు పడ్డాయి. ఈ లెక్కన ఇంకా రూ.వందకోట్లు రైతులకు అసలు డబ్బులే రావాలి. రోజు బ్యాంకుకు వెళ్లడం వెనుదిరగడం రైతుల వంతవుతుంది. ప్రారంభంలోనే ఇంత లా పరిస్థితి ఉంటే, ఇక చివరి వరకు కొనుగోళ్ల వ్యవస్థ ఎలా సాగుతుందన్న విమర్శలు వెలువడుతున్నాయి.
నిలిచిన కొనుగోళ్లు
ధాన్యం కొనుగోళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. ఇందుకు కారణాలనేకం ఉన్నాయి. కొన్నిచోట్ల తాలుందని నిలిపి వేస్తే.. మరికొన్ని చోట్ల తూకం చేసిన ధాన్యం తరలించక పోవడంతో తూకాలు నిలిచి పోతున్నాయి. ఇంకొన్ని చోట్ల వెళ్లిన లారీలను మిల్లర్లు దించుకోక పోవడంతో ఆయా గ్రామాల్లో కొనుగోళ్ల ప్రక్రియ ముందుకు సాగడంలేదు. వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో 3 రోజులుగా కొనుగోళ్ల ప్రక్రియ నిలిచింది. ఇంకా మూడు రోజులు గడిస్తే తప్పా ఇక్కడ కొనుగోలు మొదలయ్యే పరిస్థితి లేదు.
దీంతో ఎక్కడికక్కడే ధాన్యం మార్కెట్లో నిలిచిపోయింది. 4రోజుల కిందటి నుంచి దాదాపు 30వేల బస్తాల వరకు తూకం చేసిన ధాన్యం నిలిచిపోగా, ప్రస్తుతం ఇంకా 15వేల బస్తాలు మార్కెట్లో తూకం వేసినవే ఉన్నాయి. 16రోజుల కిందట తూకాలు చేసిన రైతుల ధాన్యం మార్కెట్లో తరలించకకుండా ఇంకా నిలిచి ఉందంటే ట్రాన్స్పోర్టు పరిస్థితి అర్థమవుతుంది. వీటిని తరలించిన అనంతరం మళ్లీ తూకాలు చేస్తామని అధికారులు చెబుతుండడంతో రైతులు బిక్కుబిక్కుమంటున్నారు. ఇలా ఈ ఒక్క సెంటరే కాదు.. అనేక కేంద్రాల్లో రకరకాల సమస్యలతో కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా సాగడం లేదు.
తూకం వేసి 16 రోజులైనా..
నా వడ్లు తూకం వేసి 16 రోజులైంది. 380 సంచులు తూకం వేస్తే.. ఇప్పటి వరకు తరలించడం లేదు. నెల రో జులుగా మార్కెట్ సెంటరులోనే మగ్గుతున్నా.. ఇంకా ఎన్ని రోజులు అవుతుందో అధికారులు పట్టించుకోవ డం లేదు. వర్షం వస్తే .. ఒక్క కవరు కూడా ఇవ్వడం లే దు. అడిగి అడిగి వేసారి పోతున్నాం. రైతులను నిట్టనిలువు నా ముంచుతున్నరు. సెంటర్లలో ఒక్క సమస్య కా దు.. ఎన్ని సమస్యలున్నయో.. మాకు దేవుడు కనిపిస్తున్నడు. ఇంత ఘోరంగా పరిస్థితి ఎప్పుడు లేదు. పంట పండించిన సుఖం లేదు.
– రాజు, రైతు, చిట్యాల, వనపర్తి మండలం
రెండువారాలుగా ఎదురుచూపులు
ఇప్పటికే రెండుసార్లు రా వాల్సి రైతుబంధు డబ్బు లు తమ ఖాతాలో పడలేదు. క్వింటాకు రూ. 500బోనస్ రైతులకు అదనంగా వస్తాయని మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన ధాన్యం కొ నుగోలు కేంద్రంలో 46 క్వింటాళ్ల సన్నరకం వడ్లను విక్రయించాం. రెండు వారాలుగా రూ.23 వేల బోన స్ డబ్బుల కోసం ఎదురుచూస్తున్న. వారంలో ఇస్తామన్న ధాన్యం డబ్బులు కూడా సకలంలో రావడం లేదు. ప్రభుత్వం చెప్పినట్లు పంటడబ్బులతోపాటు బోనస్ వెంటనే ఇవ్వాలి. అలా చేస్తే రైతుల అవసరాలకు ఉపయోగపడతాయి. ఇప్పటి వరకు 46 క్వింటాళ్ల బోనస్ డబ్బులే రాకుంటే.. ఇంకా దాదాపు 180 క్వింటాళ్ల ధాన్యం ఉందని, పంటను ఎక్కడ విక్రయించాలనే ఆలోచనలో ఉన్నాం.
– గొల్ల రాంచంద్రయ్య, రైతు, అమరచింత
అవసరానికి రాని బోనస్ డబ్బులు
ఈ ప్రభుత్వం చెప్పిన మా టలన్నీ ఉత్తవే అబ్బా.. అ ప్పుడు ఓట్లు వేసేటప్పు డు ఎన్నిమాటలు చెప్పి రి.. అన్ని ఉత్తవే.. బోనస్ డబ్బులు కూడా వచ్చేదా కా మాకు నమ్మకం లేదు. వారం అయిపాయే 33 క్వింటాళ్ల సన్న వండ్లు మహిళా సంఘం వాళ్లకు అమ్మినం. ఇప్పుటి వరకైతే వాళ్లు చెప్పినట్టుగా పంట డబ్బులే రాలే. ఇంకా బోనస్ డబ్బులు రూ.16500 వస్తే దేనికైనా అవసరం వస్తాయని అనుకుంటే ఇదికూడా ఉత్తమాటలాగనే ఉంది. మాకు మూడు ఎకరాల భూమి ఉం ది. అందులో వరి పంటయేస్తే కాలం కలిసిరాక అం తా తాలుపాయే. వచ్చిన పంటలో ఇంత తినడానికి పెట్టుకుని 33క్వింటాళ్ల సన్నవడ్లను ప్రభుత్వం చెప్పిన మాటలు నమ్మి మహిళా సంఘం వాళ్లు మా ఊరిలో పెట్టిన కొనుగోలు కేంద్రంలో అమ్మినం. డబ్బుల కోసం ఎప్పుడు పడుతాయని ఎదురుచూడాల్సి వస్తోంది. ఇంకా సీఎం రేవంత్రెడ్డి ఇస్తామన్న బోనస్ పైసలు ఎప్పుడు వస్తాయో ఏమో.
– మంగ్యానాయిక్, చంద్రప్పతండా, అమరచింత