ధరూర్, జూలై 3 : ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు, సకల సౌకర్యాలు కల్పించింది. డిజిటల్ విద్యాబోధన, స్మార్ట్ క్లాసుల నిర్వహణ, నిష్ణాతులైన ఉపాధ్యాయులతో బోధన, కొత్త భవనాలతో బడుల రూపు మారింది. ఇంగ్లిష్ మీడియంతోపాటు ఉచితంగా యూనిఫాం, పాఠ్య, నోట్ పుస్తకాలు అందజేస్తున్నది. మన ఊరు-మనబడి, మన బస్తీ-మన బడి కార్యక్రమం సత్ఫలితాన్నిస్తున్నది. ప్రైవేటుకు దీటుగా సర్కార్ బడుల్లో విద్యాబోధన జరుగుతున్నది. దీంతో సర్కార్ స్కూళ్లకు క్రేజ్ పెరిగింది. విద్యార్థులు భారీగా చేరుతున్నారు.
పాఠశాలలు పునఃప్రారంభమైన 20 రోజుల్లోనే చాలా పాఠశాలల్లో ప్రవేశాలు నిండిపోతున్నాయి. తాజాగా జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో పది రోజుల కిందటే అడ్మిషన్లు ఫుల్ అయ్యాయి. సోమవారం ధరూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల సంఖ్య నిండిపోయింది. దీంతో హెచ్ఎం నాగేటి ప్రతాపరెడ్డి పాఠశాల గేట్ వద్ద నో అడ్మిషన్ బోర్డును ఏర్పాటు చేశారు. ఇప్పటికే 75 నుంచి 105 మంది విద్యార్థులు కొత్తగా ప్రవేశాలు పొందారని హెచ్ఎం తెలిపారు.
తరగతి గదులు పూర్తిగా కిక్కిరిసిపోయాయని, బెంచీలు సరిపోవడం లేదని, గరిష్ఠ స్థాయికి మించి చేరారని ఆయన తెలిపారు. మొత్తం 1,100 మంది స్టూడెంట్స్ ఉన్నారని, అందుకే కొత్తగా అడ్మిషన్స్ తీసుకోలేకపోతున్నామన్నారు. ఒకవేళ ప్రత్యేక పరిస్థితులు కల్పిస్తే ఆలోచిస్తామని సూచించారు. తల్లిదండ్రులు సహకరించాలని ఆయన కోరారు. గతంలో విద్యార్థుల సంఖ్య లేక చాలా ప్రాంతాల్లో బడులు మూతబడుతుంటే నేడు సీఎం కేసీఆర్ తీసుకున్న సంస్కరణలతో పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడుతున్నాయని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.