కల్వకుర్తి, జూలై 12 : అధికారంలోకి వచ్చి రెండేైళ్లెనా చేసిన అభివృద్ధి శూన్యం.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకే దిక్కులేదు.. మరోసారి స్థానిక సంస్థల కోసం చేసిన శంకుస్థాపనలకే మళ్లీ శంకుస్థాపనలు చేసి కాంగ్రెస్ తన మోసపూరిత నైజాన్ని బయటపెట్టుకున్నదని మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మండిపడ్డారు. కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ భూమి 99 సర్వేనెంబర్ 99లో 100 పడకల దవాఖానకు రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేలతో కలిసి శంకుస్థాపన చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
శనివారం కల్వకుర్తిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జైపాల్‌యాదవ్ మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో 2023 అక్టోబర్ 1న నాటి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా కల్వకుర్తిలోని 99 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి మూడెకరాల 20 గుంటల భూమిలో రూ.27.50 కోట్ల అంచనా వ్యయంతో 100 పడకల దవాఖానకు శంఖుస్థాపన చేయించామని వివరించారు.
అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పనులు ప్రారంభించకుండా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎక్కడ పేరు వస్తుందోనన్న అక్కసుతో 18నెలల తర్వాత అదే స్థలంలో తిరిగి మంత్రులతో శంఖుస్థాపన చేయించడం రాజకీయ దివాళుకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. సీనియర్ మంత్రులై ఉండి చేసిన పనులకు మళ్లీ శంకుస్థాపనలు చేయడం ఎంత వరకు ఇంగీతమనిపించుకుంటుందని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలను మాయచేసి లబ్ధి పొందే ఉద్దేశంతో ఇ లాంటి చేవలేని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం సిగ్గుచేటన్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో కల్వకుర్తి నియోజవర్గంలో రూ.5వేల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని పనుల వివరాలను గణాంకాలతో సహా వివరించారు. విద్య, వైద్య, రహదారులు, మౌలిక సదుపాయాలు, గ్రామీణ వ్యవస్థ బలోపేతం వంటి కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల కాలంగా ఎలాంటి అభివృద్ధి చేయలేక, చెప్పుకోవడానికి ఏమీ లేక చేసిన పనులకు శంఖుస్థాపనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ అమలు చేసిన సంక్షేమ పథకాలను అటకెక్కించిన కాంగ్రెస్ దోచుకో- దాచుకో అనే పాలసీని సాగిస్తూ రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేస్తుందని మండిపడ్డారు.
రుణమాఫీని సగానికే పరిమితం చేసి రైతుభరోసా రెండు విడుతలుగా ఎగ్గొట్టి, ఆరుగ్యారెంటీలు అమలు చేయలేక స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల దృష్టిని మళ్లించేందుకు శంఖుస్థాపనల నాటకాలకు తెరలేపిందని ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఖచ్చితమైన ప్రణాళిక లేదని, వర్షాకాలం ప్రారంభమైనా ఎరువులు, విత్తనాల కొరత ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు డీఏ, ఫించన్‌దారులకు బకాయిలు, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్నిరంగాల్లో కాంగ్రెస్ అట్టర్‌ఫ్లాప్ అయ్యిందని తేటతెల్లమవుతున్నదన్నారు. విఫలం చెందిన కాంగ్రెస్ ప్రజలకు క్షమాపణ చెప్పి అధికారం నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు.
జైపాల్‌రెడ్డి ఆత్మఘోషిస్తుంది..
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి పేరు పెట్టడాన్ని పా ర్టీల కతీతంగా తాము అందరం స్వాగతించామని జైపాల్‌యాదవ్ చెప్పారు. రెండేండ్లు కావొస్తున్నా ఇప్పటి వరకు పాలమూరు- రం గారెడ్డి పథకానికి 18 రూపాయలు కూడా కేటాయించలేదని ఆందోళన వ్యక్తం చే శారు. జైపాల్‌రెడ్డి పేరు పెట్టి కనీస స్థాయిలో నిధు లు కేటాయించకపోవడంతో ఆయన ఆత్మ ఘోషిస్తుందని ఆవేద న వ్యక్తం చేశారు. నల్లమల్ల పులిబిడ్డ అని చెప్పుకునే సీఎం రేవంత్‌రెడ్డి పిల్లి పిల్లగా మారిపోయాడని, పరిపాలనపై పట్టు కోల్పోవడంలతో రాష్ట్ర వ్యవస్థ గాడితప్పిందన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ చేతిలో కాంగ్రెస్ చావుదెబ్బ తినక తప్పదని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ శ్రేణులు ఐక్యంగా ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎడ్మ సత్యం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్‌గౌడ్, వైస్ ఎంపీపీ గోవర్ధన్, సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు జంగయ్య, సూర్యలతా కాటన్‌మిల్లు గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు సూర్యప్రకాశ్‌రావు, మాజీ కౌన్సిలర్లు తాహేర్ అలీ, సైదులుగౌడ్, మనోహర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు శ్రీధర్, వీరయ్య, కిశోర్, భగత్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.