మహబూబ్‌నగర్, జూలై 26 : వర్షం ఉగ్రరూపం దాల్చడంతో ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు వరద పెరుగుతున్నది. వర్షాల నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం రెండ్రోజులు సెలవులు ప్రకటించింది. మహబూబ్‌నగర్ ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే వెంటనే కాల్ చేసి సమాచారం అందించేందుకు టోల్‌ఫ్రీ నెంబర్(08542-241165)ను కూడా అందుబాటులో ఉంచారు.
ఉమ్మడి జిల్లా పరిధిలోని కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద వస్తున్నది. లింగల్చేడ్తోపాటు, గండీడ్ మండలం సల్కర్‌పేట వాగు, గోండ్యాల్ వాగుతోపాటు జడ్చర్లలోని పలు వాగులు పొంగి పొర్లుతున్నాయి. బుధవారం జూరాలకు కూడా వరద పెరిగింది. దుందుభీ ప్రవాహానికి సరిహద్దు ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఉబికి వస్తున్నాయి. వివిధ ప్రాజెక్టులకు వరద అధికంగా చేరుకుంటుండడంతో అధికారులు ఉధృతి ఆధారంగా దిగువకు వదులుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు 40శాతం నిండిపోయాయి. జూరాల ప్రాజెక్టుకు 30వేల క్యూసెక్కుల వరద వస్తున్నది. వరదను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే కాలువ సమీపంలో నివాసం ఉంటున్న వారికి హెచ్చరికలు జారీ చేశారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. వనపర్తి జిల్లా కొత్తకోటలో 69.8 మీ.మీ., పెబ్బేరులో 67.8 మి.మీ., పాన్గల్లో 60.3మి.మీ., అమరచింత, శ్రీరంగాపూర్, ఆత్మకూర్, మదనాపూర్లో 58 నుంచి 53మి.మీ. వర్షపాతం నమోదైంది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో 40.3 మి.మీ., కోడేరులో 34.7మి.మీ.ల వర్షం కురిసింది. జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలో 40.1 మి.మీ., అలంపూర్‌లో 39.6మి.మీ., గద్వాలలో 36.3మి.మీ., ఇటిక్యాలలో 33.8మి.మీ.ల వర్షం కురిసింది. నారాయణపేట జిల్లా నర్వ మండలంలో 37.0 మి.మీ., మక్తల్‌లో 32.0మి,మీ., ఊట్కూర్‌లో 22.4మి.మీ. వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్ మండలంలో 1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు కొన్ని పాత ఇండ్లు కూలిపోయాయి. హన్వాడ మండలం షేక్‌పల్లి గ్రామంలో బండల ఇల్లు కూలిపోగా, వనపర్తి జిల్లాలోనూ ఒక ఇల్లు కూలింది. పట్టణ ప్రాంతాల్లోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో పాఠశాలలకు కూడా ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
మహబూబ్‌నగర్‌లో పలు అభివృద్ధి పనులు చేసేందుకుగానూ ప్రభుత్వం రూ.276కోట్లు మంజూరు చేసింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు కొసాగిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఇదివరకే ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు లేకుండా ముందస్తుగా వారిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.