అయిజ, ఫిబ్రవరి 15 : కంది రైతులు కన్నెర్ర చేశా రు. కందుల కొనుగోళ్లలో పీఏసీసీఎస్ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం అయిజ పట్టణంలోని సబ్ మార్కెట్ యార్డులో ఆందోళన చేపట్టారు. 50 కేజీల కందుల బస్తాకు సిబ్బంది కేజీ 300 గ్రా ముల తరుగు తీస్తున్నారని ఆవేదన వ్యక్త చేశారు. సర్కారు నిబంధనల ప్రకారం 50 కేజీల బస్తాకు కేవలం 600 గ్రాములు అదనంగా సేకరించాల్సి ఉన్నప్పటికీ 700 గ్రాములు అదనంగా సేకరిస్తుండడంతో రైతులు నష్టపోతున్నారని చెప్పారు. అదనంగా ఎందుకు సేకరిస్తున్నారని రైతులు ప్రశ్నిస్తే కొనుగోళ్లను నిలిపివేస్తున్నారని వాపోయారు. రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య మార్కెట్‌కు చేరుకుని మద్దతు తెలిపారు.
పంటల కొనుగోళ్లలో రైతులకు నష్టం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ విషయమై మార్క్‌ఫెడ్ డీఎంతో ఫోన్లో మాట్లాడారు. 50 కేజీల బస్తాకు కేవలం 600 గ్రాములు తీయాలని సూచనలు చేశామని, అదనంగా తీస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. సింగిల్ విండో చైర్మన్ మధుసూదన్‌రెడ్డి రైతుల ఆందోళన వద్దకు వచ్చి నిబంధనల మేరకు అదనంగా తీసుకుంటామని చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కువగా ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించడంతో ఆయన కొనుగోళ్లను నిలిపివేస్తామని అక్కడి నుంచి జారుకున్నారు. సరైన సమాధానం రాలేదని పీఏసీసీఎస్ వద్దకు చేరుకుని రైతులు మళ్లా ఆందోళనకు దిగారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన అదనపు కందులను రైతుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. అయిజలో జరుగుతున్న అవకతవకలపై కలెక్టర్, అదనపు కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్తామని పల్లయ్య చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు మత్తాలి, మాధవ్, రైతులు తిప్పన్న, గోవిందమ్మతోపాటు పలువురు పాల్గొన్నారు.
రైతులను మంచుతున్నరు..
కందుల కొనుగోళ్లలో రైతులను నిం డా ముంచుతున్నరు. మద్ధతు ధరకు పంటను అమ్ముకుందామని వ స్తే నిబంధనల పేరుతో ఎకరాకు 3 క్విం టాళ్లు కొంటామని, అమ్మిన కందులకు అదనంగా తీసుకుని రైతులకు నష్టం చే స్తున్నరు. అధికారులు కొనుగోళ్లు కేంద్రాలను తనిఖీ చేయకపోవడంతోనే కొనుగోలుదారులు అదనంగా తీసుకుంటున్నరు. అధికారులు తనిఖీ చే సి నిబంధనల ప్రకారం కొనుగోలు చేసేలా చూడాలి.
– తిప్పన్న, రైతు, వెంకట్రామనగర్, వడ్డేపల్లి మండలం
మూడ్రోజులైనా కొంటలేరు..
మూడ్రోజులైనా కందులను కొనుగోలు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. అరాసైనా కందులను కొనుగోలు చేయకపోవడంతో రాత్రనకా పగలనకా మార్కెట్లోనే పడిగాపులు కాయాల్సి వస్తుంది. వెంటనే కొనుగోలు చేసి, గో దాంలకు తరలిస్తే బాగుంటది. రైతులను ఇబ్బందులు గురి చేయొద్దు. సర్కారు నిబంధనల ప్ర కారం వెంటనే కొనుగోలు చేసి రైతుల ఖాతాల కు నగదు జమ చేయాలి.
– గోవిందమ్మ రైతు, తూంకుంట, అయిజ మండలం
నిబంధనల ప్రకారం కొనుగోళ్లు
మార్క్‌ఫెడ్ నిబంధనల ప్రకారం కందుల ను కొనుగోలు చేస్తున్నాం. 50 కేజీల బస్తాకు కేజీ అదనంగా తీసుకుంటున్నం. రైతుల ఎదుటనే కందులను కొనుగోలు చేస్తున్నం. పిడికె డు కందులను సిబ్బంది అదనంగా తీసుకోరు. రైతులు ఆరోపించినట్లుగా ఎలాంటి చేతివా టం ప్రదర్శించడం లేదు. రైతులు ఆందోళన చేస్తే కొనుగోళ్లలో జాప్యమైతే రైతులే నష్టపోత రు. రైతులు సహకరిస్తే కొనుగోళ్లు వేగవంతం చేస్తం.
– మధుసూదన్‌రెడ్డి, సింగిల్ విండో చైర్మన్, అయిజ